భాజపాలో వారసత్వ రాజకీయాలకు తావులేదని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. భీమవరంలో గురువారం నరసాపురం పార్లమెంటు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం అమలు చేసే పథకాలు, గృహ నిర్మాణం, రహదారుల అభివృద్ధి వంటి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాలని శ్రేణులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై వైకాపా స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటోందన్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు బిల్లులు చెల్లించక పోవడంతో వైద్యులు సేవలు నిలిపివేశారని తెలిపారు. అనంతరం ఎన్నికల సమర శంఖం పూరించారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, దంతులూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో భాజపా విజయ ఢంకా మోగిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. నరసాపురం ఎంపీగా భాజపా అభ్యర్థి విజయం సాధిస్తారన్నారు. ఇప్పటి వరకు మూడుసార్లు పోటీ చేయగా రెండుసార్లు విజయం సాధించామన్నారు. తల్లిని, చెల్లిని సరిగా చూడని సీఎం మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ నాయకులు పాకా వెంకట సత్యనారాయణ, సాగి కాశీవిశ్వనాథరాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిశోర్, వినోద్‌కుమార్ వర్మ, కె.సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
గురువారం ఉదయం భీమవరం చేరుకున్న పురందేశ్వరికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జువ్వలపాలెం రోడ్డులో భారీ ప్రదర్శనగా ముందుకుసాగారు. ప్రకాశంచౌక్ కూడలిలో భారీ గజమాల వేశారు. వాహనంపై పురందేశ్వరి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, నార్ని తాతాజీ, పేరిచర్ల వెంకట శ్రీనివాసరాజు తదితరులు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం నర్సయ్య అగ్రహారంలోని పార్టీ ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు.
source : eenadu.net
Discussion about this post