తెదేపా అధికారం చేపట్టాక కదిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో కృషి చేస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం కదిరిలో స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రను బాలయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. జీవిమాను కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లక్ష్మీనరసింహస్వామి తన ఇష్టదైవమని, దుష్ట శిక్షణకు వెలసిన స్వామి దర్శనంతో వైకాపా పాలన అంతానికి సైకిల్ రావాలి – స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారానికి చెర్లోపల్లి రిజర్వాయరు నుంచి సరఫరా చేస్తామని, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తామని పేర్కొన్నారు. రోడ్డుషోకు ముందు పీవీఆర్ ఫంక్షన్‌హాల్‌లో కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీల కోసం తెదేపా ముందుండి పనిచేస్తుందన్నారు.
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తెదేపా ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం మారితే ముస్లింలకు ఉన్న బీసీ-ఇ రిజర్వేషన్ రద్దు చేస్తారంటూ అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెదేపాతోనే ముస్లింలకు ఎంతో మంచి జరిగిందన్నారు. కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్, హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బీకే పార్థసారథిలను గెలిపించాలని కోరారు. తెదేపా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బీవీ వెంకటరాముడు, కృష్ణమోహన్‌నాయుడు, పర్వీన్‌బాను, ఇర్ఫాన్, భైరవప్రసాద్, వేణుగోపాల్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, ఎన్‌బీకే ఫ్యాన్స్ నాయకుడు మధు తదితరులు పాల్గొన్నారు.
బస్సు యాత్ర శనివారం రాత్రి 8.30 గంటలకు కొత్తచెరువు కూడలికి చేరుకుంది. తెదేపా అభ్యర్థి పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జనసేన జిల్లా కార్యదర్శి పత్తి చంద్రశేఖర్‌లతో కలిసి బాలకృష్ణ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రసంగించారు.
source : eenadu.net
Discussion about this post