బీసీల ఓట్లు దండుకుని నట్టేట ముంచిన నమ్మక ద్రోహి జగన్ అని రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. బీసీలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, అక్రమ కేసులు బనాయించి ఎన్నో ఇబ్బందులు పెట్టారని, తెదేపా అధికారంలోకి రాగానే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం అనంతపురం గ్రామీణం సిండికేట్‌నగర్‌లో నిర్వహించిన జయహో బీసీ సభలో అమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హయాం నుంచి బీసీలకు తెదేపా పెద్దపీట వేసిందన్నారు. తెదేపా హయాంలో బీసీ కార్పొరేషర్ ద్వారా అన్ని కులాలకు సంబంధించిన రుణాలతో పాటు రాయితీతో పరికరాలు, వాహనాలు అందజేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ పథకాలన్నీ రద్దు చేసిందన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, సోదరులకు రెవెన్యూ అధికారులు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుశాఖలో పలువురు వారికి కొమ్ముకాస్తూ అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పేరూరు ప్రాజెక్టుకు మరమ్మతులకు రూ.804 కోట్లు మంజూరు చేశామని, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే బీసీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
source : eenadu.net
Discussion about this post