రాష్ట్రంలో ఐదేళ్లు దోపిడీ పాలనను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగించారని భాజపా జాతీయ కార్యదర్శి, ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ విమర్శించారు. సోలార్ ప్రాజెక్టుల పేరుతో 2.50 లక్షల ఎకరాలకు శఠగోపం పెట్టే పని చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ధర్మవరం శారదానగర్‌లో ఎన్డీఏ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి.. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలు సేకరించామని, సూత్రధారి అయిన జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఆయనకు సహకరించిన వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో సోలార్ పేరిట కొన్ని కంపెనీలను ముందు పెట్టి శిర్డీ సాయి, ఇండోసార్ సంస్థలకు భూములు కేటాయించారని ఆరోపించారు. బినామీ సంస్థలకు పొందిన భూముల లెక్క రాబోయే రోజుల్లో తేలుస్తామన్నారు.
ధర్మవరం నియోజకవర్గంలో రూ.5,100 కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే కేతిరెడ్డి చెబుతున్నారని, ఎక్కడ అభివృద్ధి చేశారో చూపాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. కేతిరెడ్డి రూ.5 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు ఎదిగారన్నారు. ఎమ్మెల్యే దోచుకున్న 500 ఎకరాలను బయటపెడతామన్నారు. తనకు ధర్మవరంలో సందులు తెలియవని ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, తాను ప్రజలను కలుసుకునేందుకే సందులు, గొందులు తిరుగుతానని, కబ్జాలకు మాత్రం కాదని ఎద్దేవా చేశారు. తాను ఎక్కడి నుంచో వచ్చానని ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, వైకాపా హిందూపురం ఎంపీ అభ్యర్థి పక్క రాష్ట్రం నుంచి రాలేదా..? కేతిరెడ్డి తిమ్మంపల్లి నుంచి రాలేదా..? అని ప్రశ్నించారు. తాను రాయలసీమలోని ప్రొద్దుటూరు నుంచే వచ్చానని ధర్మవరం ప్రజలు తనను స్వాగతించడం ఎమ్మెల్యేకు మింగుడుపడటం లేదన్నారు. ఎమ్మెల్యే అహంకారాన్ని అణిచివేస్తామన్నారు. ధర్మవరం అభివృద్ధిపై తాను చర్చకు ఎప్పుడైనా సిద్ధమేనని, అందుకు ఎమ్మెల్యే సిద్ధమా అని సవాల్ విసిరారు.
source : eenadu.net
Discussion about this post