‘‘ఏ-1 ఆంధ్రప్రదేశ్‌లో, ఏ-2 రాజ్యసభలో కూర్చున్నారు. ఇలాంటివారు పాలన సాగిస్తే ఎలా ముందుకెళ్తాం? అందువల్ల కేంద్రప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి అవినీతిపరులపై వేగంగా చర్యలు తీసుకోవాలి’’ అని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంలోని అంశాలపై మాట్లాడారు. ‘‘కేంద్ర ఆర్థికమంత్రి విడుదల చేసిన శ్వేతపత్రం 2014కి ముందున్న అవినీతి గురించి చెబుతోంది. 2004-2014 మధ్య దేశంలో అత్యధిక అవినీతి ఆంధ్రప్రదేశ్‌లో జరిగినా దాని గురించి ఈ పత్రంలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో రాజా ఆఫ్ కరప్షన్ ఉన్నారు. అప్పుడే రాజకీయాల్లోకి అవినీతి యువరాజు కూడా వచ్చారు. 2004లో ఆయన తండ్రి రాష్ట్రంలో కీలకమైన పదవిలోకి వచ్చేటప్పటికి ఆయన ఆస్తులు రూ.1.75 కోట్లు. 2011 నాటికి వారి ఆస్తులు రూ.356 కోట్లకు పెరిగాయి. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది లేదు. వారెన్ బఫెట్ గానీ, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గానీ ఇంతటి వృద్ధిని కలలో కూడా ఊహించి ఉండరు. ఇంత వేగంగా వృద్ధి సాధ్యమైందని ఈ సభలో ఉన్నవారితో పాటు, ఈడీ, ఐటీలు కూడా ఆశ్చర్యపోతాయి. ఈ వ్యక్తికి చెందిన రూ.43వేల కోట్ల ఆస్తులు ఎటాచ్ చేశారు. ఆయనపై 32కేసులు నమోదయ్యాయి. అందువల్ల కేంద్రప్రభుత్వం దేశంలోని అవినీతి గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్రాల్లోని చిత్రాలనూ చూడాలి. రూ.43వేల కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో కూడా చాలామందికి తెలియదు. అందుకే 2014లో రాష్ట్ర ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటేసి రాష్ట్రంలో చంద్రబాబుకు, కేంద్రంలో మోదీకి అధికారం కట్టబెట్టారు. 2014 నుంచి 2019 వరకు ఏపీలో ఒక్క అవినీతి కేసు కూడా లేదు. ఆ కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభిప్రాయ భేదాలున్నా అవి రాష్ట్రం, దేశాభివృద్ధికి సంబంధించిన అంశాలకే పరిమితయ్యాయి. 2019లో అవినీతిలో ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్ అధికారంలోకి వచ్చి అదే అవినీతి సంస్కృతిని మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయనే కీలకపదవిలో ఉండటంలో రాష్ట్రంలోమాఫియాను లీగలైజ్, సెంట్రలైజ్ చేశారు. రాష్ట్రంలో మద్యం మాఫియా మొదలైంది. ఇప్పుడు టీ ఖర్చు కూడా గూగుల్ పేతో చెల్లిస్తుంటే మద్యానికిమాత్రం నగదే ఇవ్వాల్సి వస్తోంది. దీనిద్వారా ఎంత అవినీతి సొమ్మును సృష్టిస్తున్నారో ఆలోచించుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం ఇసుకను ఒకే కంపెనీకి అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయడమే కాకుండా అందుకు పాల్పడినవారిపై కఠినచర్యలు తీసుకోవాలి’’ అని డిమాండు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్‌నూర్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరించినట్లే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కోరారు.
source : eenadu.net
Discussion about this post