‘పదేళ్లయినా పోలవరం పూర్తికాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎక్కడంటే చెప్పలేని పరిస్థితి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దిల్లీలో ఈ ప్రాంత నాయకులు తాకట్టు పెట్టారు..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంటు త్రిష్ణ గ్రౌండ్స్‌లో శనివారం కాంగ్రెస్ నిర్వహించిన ‘న్యాయసాధన సభ’కు రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష అందజేసే ‘మహాలక్ష్మి’ పథకానికి సంబంధించిన బ్రోచర్‌ను రేవంత్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆవిష్కరించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘చాలామందికి అనుమానాలు, అపోహలు ఉండొచ్చు. వైఎస్సార్ వారసులు ఎవరని? రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే రాజశేఖరరెడ్డి చివరి కోరిక. ఆయన సంకల్పం నిలబెట్టేవాళ్లే వారసులవుతారు తప్ప ఆయన ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కాలేరు’ అన్నారు. కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలకు అండగా నిలవాలన్న షర్మిలే వైఎస్ నిజమైన వారసురాలని పేర్కొన్నారు. వైఎస్సార్ నిజమైన లౌకికవాది అని, ఏ రోజూ భాజపాతో అంటకాగలేదని వివరించారు. వైఎస్సార్ వారసులుగా చెప్పుకొనేవారు మణిపుర్‌లో హింసపై మోదీని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఏపీలో పరిస్థితులు కొన్నేళ్లుగా నిశితంగా గమనిస్తే.. ‘ఇక్కడ పాలించే నాయకులవ్వాలని చూస్తున్నారు కానీ.. ప్రశ్నించే గొంతుకలవ్వాలని అనుకోవట్లేదు’ అని జగన్, చంద్రబాబు, పవన్‌ను ఉద్దేశించి అన్నారు. దిల్లీలో ఉన్న మోదీ ఏపీలో ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటున్నారంటే ఈ ప్రాంతం నుంచి ఆయనను ప్రశ్నించేవాళ్లు లేకపోవడమే కారణమని అన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించిన ఉక్కు కర్మాగారాన్ని అదానీ కోసం ప్రధాని తెగనమ్ముతుంటే ఇక్కడి నాయకులు ప్రశ్నించడం లేదన్నారు. భౌగోళిక స్వరూపం కోసం ఆంధ్ర, తెలంగాణ అని రాష్ట్రాలుగా విడిపోయాయని, హక్కుల కోసం ఒక్కటై ఒకరికొకరు అండగా నిలబడితే తెలుగు గడ్డపై ఒక్క ఇటుకనూ కదల్చలేరని భరోసానిచ్చారు.
source : eenadu.net
Discussion about this post