ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల ‘అనర్హత’పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఆయా పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విచారణకు రావాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లు నోటీసులు ఇచ్చారు. ఇదే తుది విచారణ నోటీసులని పేర్కొంటూ.. హాజరుకాకుంటే అనర్హతపై తుది నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో నేటి విచారణకు హాజరవుతారా? లేదా? అనే చర్చ నడుస్తోంది.
వైఎస్సార్‌సీపీ నుంచి నెగ్గి.. టీడీపీలోకి పార్టీ ఫిరాయించారు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు. అలాగే మండలిలోనూ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణలు పార్టీ ఫిరాయించారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన వీళ్లపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌లకు ఫిర్యాదులు చేశారు. వీళ్లతో పాటు టీడీపీ తరఫు నుంచి కూడా అనర్హత ఫిర్యాదు నమోదు అయ్యింది.
.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్న తర్వాతే.. వాళ్లపై నమోదు అయిన అనర్హత పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ..స్పీకర్, మండలి చైర్మన్‌లు ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ నోటీసులు పంపిస్తూ వచ్చారు. అయితే వీళ్లలో కొందరు అరకోరగా విచారణకు హాజరయ్యారు. మూడుసార్లు నోటీసులు ఇస్తే.. రకరకాల కారణాలతో వాళ్లు విచారణకు గైర్హాజరు అవుతూ వస్తున్నారు.
సాంకేతిక-వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ.. పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ నలుగురు. దీంతో.. ఇవాళ (19వ తేదీన) విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆనంకు నోటీసులు పంపింది. సాయంత్రం 4గం. విచారణ ఉంటుందని.. రాకపోతే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. వీళ్ల విచారణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో జరగనుంది.
source : sakshi.com
Discussion about this post