ఉమ్మడి జిల్లాలో తమకు అనుకూలంగా పనిచేయాలని తెదేపా ఆశావహులు, ఒక స్థాయి నేతలను ప్రలోభాలకు గురిచేయాలని ఆయన వేసిన వ్యూహం బెడిసికొట్టింది.. సొంత పార్టీలోని అసమ్మతులు తెదేపా బాట పట్టినా నిలుపుకోలేని దైన్యస్థితికి వచ్చారు. సీఎం చెప్పారని అసమ్మతులను బుజ్జగించాలని చూసినా వారు లక్ష్య పెట్టక.. తెలుగుదేశం పార్టీ బాట పట్టడంతో నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డితో సమావేశం ఉందని తెలిసినా పలువురు కీలక నేతలు నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో చేరడంతో వైకాపాకు మింగుడు పడటం లేదు.
‘సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైకాపా పరిస్థితి బాగాలేదు.. దాన్ని చక్కదిద్దాల్సిన అవసరముంది.. వెంటనే వెళ్లి గాడిన పెట్టాలని నాకు సీఎం జగన్ చెప్పారు.. సీఎం చెప్పిన తర్వాతే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశా..’ ఆయన మాటలు ఈ నియోజకవర్గంలోనే కాదు.. జిల్లావ్యాప్తంగా వైకాపా దుస్థితిని ప్రస్ఫుటం చేస్తున్నాయి.
జిల్లా పరిధిలో పలువురు నేతలు వైకాపాను వీడుతున్నారు. మంత్రి మంత్రాంగం చేసినా వారు పార్టీలో ఉండేందుకు ససేమిరా అంటున్నారు. నాయుడుపేట పురపాలిక వైస్ ఛైర్మన్ షేక్ రఫీ, వైకాపా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ కట్టా సురేఖారెడ్డి పార్టీకి, తమ పదవులకు శుక్రవారం రాజీనామా చేశారు. వారి బాటలోనే నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామానికి చెందిన వైకాపా బీసీ సెల్ అధ్యక్షుడు దుప్పల రవీంద్రతోపాటు ఆయన భార్య మర్లపల్లి సర్పంచి మంజుల కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరందరూ తెదేపాలో చేరారు.
అనుచరుడికే టికెట్ ఇప్పించినా..
సత్యవేడు నియోజకవర్గంలో తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకున్న ఆనందం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎంతో సేపు నిలవలేదు. స్థానికులకు టికెట్ ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఎలా ఇస్తారంటూ ఈ నియోజకవర్గంలోనూ పలువురు అసమ్మతి రాగం పెంచారు. కేవీబీపురం మండలానికి చెందిన నేత ఏకంగా తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లుగా ఒక వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన ఏమయ్యారో తెలియని పరిస్థితి.
మంత్రాంగం చేసినా..
సత్యవేడు నియోజకవర్గంలో తొలుత ప్రస్తుత ఎంపీ గురుమూర్తికి టిక్కెట్ ఇప్పించారు. ఆయన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి సమాచారం ఇవ్వకుండానే ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. అసహనానికి గురైన ఆదిమూలం.. పెద్దిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసి పార్టీని వీడారు. ఎమ్మెల్యేపై దుమ్మెత్తిపోయాలని, వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని చెప్పినా ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. తాజాగా సూళ్లూరుపేట పరిధిలోనూ అసమ్మతులను బుజ్జగించేందుకు మంత్రి వస్తున్నట్లు ముందుగానే అందరికీ సమాచారమిచ్చినా నేతలు పట్టించుకోలేదు. దీంతో మంత్రి మంత్రాంగం ఫలించలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీలో ఎంతమంది నేతలు పార్టీని వీడతారో అనే ఆందోళన వైకాపా నేతల్లో మొదలైంది.
అన్ని నియోజక వర్గాల్లోనూ అదే పరిస్థితి
ఒక్కొక్కటిగా అసమ్మతి సెగలు అధికారపార్టీలో పలు నియోజకవర్గాల్లో వెలుగులోకి వస్తున్నాయి.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు జడ్పీటీసీలు వెంకటసుబ్బారెడ్డి, తిరుమలయ్య, అర్చనాదేవీలతోపాటు మాజీ జడ్పీటీసీ వెంకటాచలం సైతం వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు.
గూడూరులోనూ విఘ్నేశ్వరపురం ప్రాంతానికి చెందిన 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. మంత్రి తనకు అనుకూలమైన వ్యక్తికి అక్కడ టికెట్ ఇప్పించుకోగలిగారు. దీంతో అక్కడ అసమ్మతి నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
source : eenadu.net
Discussion about this post