రెండేళ్ల కిందట విజయవాడ చిరునామాతో అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన రూ.వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో దొరకడం సంచలనమైతే… తాజాగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకే లక్షల కోట్ల విలువైన మాదకద్రవ్యం దిగుమతి కావడం పెను సంచలనం కలిగిస్తోంది. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న, వైకాపా ప్రభుత్వ తమ కలల రాజధానిగా చెప్పుకొంటున్న విశాఖలో దేశమంతా ఉలిక్కిపడేంతగా ఎన్నికల తరుణంలో రూ.లక్షల కోట్ల విలువైన వేల కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి ఊరూరా వ్యాపించింది. దానికి బానిసలుగా మారుతున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ మాదకద్రవ్యాలు వ్యాప్తి చెందుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వీటన్నింటికీ జగన్ ప్రభుత్వమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఐ నమోదుచేసిన వివరాల ప్రకారం… బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి ‘ఎస్‌ఈకేయూ 4375380’ కంటెయినర్ ‘డ్రైడ్ ఈస్ట్’ బ్యాగ్‌లతో విశాఖకు బయలుదేరింది. ఈ కంటెయినర్ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయింది. జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటెయినర్‌ను స్క్రీనింగ్ చేశారు. ఇందులో మాదకద్రవ్యాలు ఉన్నట్లు అనుమానించారు. ఇంటర్‌పోల్ అప్రమత్తమై ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ నెల 16న విశాఖకు చేరిన నౌకను దిల్లీ నుంచి వచ్చిన ఉమేశ్, ఆకాష్ కుమార్ మీనా, గౌరవ్ మిట్టల్ బృందం స్థానికంగా కస్టమ్స్ అధికారుల సాయంతో తనిఖీలు చేపట్టింది. కంటెయినర్ లోపల ఒక్కో బ్యాగ్‌లో 25కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు… అంటే 25వేల కేజీల ఎండిన ఈస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ల్యాబ్ నుంచి సాంకేతిక నిపుణుల బృందాన్ని పిలిపించి.. ఈ నెల 19న నమూనాలు సేకరించి నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షించారు.
మొత్తం 49 నమూనాలను పరీక్షించగా, 27 నమూనాల్లో నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కలిన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది. ర్యాండమ్‌గా తనిఖీ చేసిన మరో 20 ప్యాకెట్లలోనూ కొకైన్, మెథాక్వలోన్ అనే రెండు రకాల డ్రగ్స్ కలిసి ఉన్నట్లు ఫలితాలొచ్చాయి. ఒక్కో బ్యాగ్‌లో ఎంత మేర డ్రగ్స్ ఉన్నాయనే లెక్క తేల్చాల్సి ఉంది. ఈ మాదకద్రవ్యాలు అత్యంత ఖరీదైనవిగా అధికారులు చెబుతున్నారు. ఒకవేళ 25వేల కిలోల్లో భారీ మోతాదులో మాదకద్రవ్యాలు లభిస్తే రూ.లక్షల కోట్ల డ్రగ్స్ రాకెట్‌గా ఈ కేసు నిలుస్తుంది. ఇందులో అంతర్జాతీయ నేరముఠా ప్రమేయం ఉండొచ్చని సీబీఐ భావిస్తోంది.
source : eenadu.net
Discussion about this post