ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అవినీతి చరిత్రను నిత్యం ప్రజలకు వివరిస్తూనే ఉంటామని, తమపై శివాలెత్తారని భయపడబోమని, వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప బాధ్యురాలు మాధవి పేర్కొన్నారు. నగరంలోని అష్టలక్ష్మి కల్యాణమండపంలో ఆర్‌ఎస్‌యూ(రివల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్) వ్యవస్థాపక అధ్యక్షుడు వెణుతుర్ల రవిశంకర్‌రెడ్డితో పాటు 250 మంది తెదేపాలో చేరగా, వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్‌బాషా నగర అభివృద్ధిని విస్మరించారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2014లో డిప్యూటీ సీఎం ఆస్తి, ఇప్పుడున్న ఆస్తి ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. కడప బాధ్యురాలు మాధవి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మహిళలు, కొన్ని సామాజిక వర్గాలను అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మహిళపై గౌరవం లేని ఎమ్మెల్యేను ఓడించేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్, గోవర్ధన్‌రెడ్డి, బెస్త సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ రాంప్రసాద్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, తిరుమలేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post