రాష్ట్రంలో తక్షణమే పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనాతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని సీఎస్‌కు వివరించారు.
‘కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బందితో పంపిణీ చేపట్టాలి. పింఛన్లు తీసుకోవడానికి రెండు, మూడు కి.మీ. దూరంలో ఉండే సచివాలయాలకు రావాలని చెప్పడం సరికాదు. ఎండల తీవ్రత దృష్ట్యా లబ్ధిదారులు ఇబ్బందిపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని సీఎస్‌కు చంద్రబాబు సూచించారు. పింఛన్ల పంపిణీపై తప్పుడు ప్రచారం చేస్తున్న మంత్రులు, వైకాపా నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఈవోను చంద్రబాబు కోరారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పింఛన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు.
ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పలేదు
పింఛన్ల పంపిణీపై తెదేపా ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని, ఎన్నికల సంఘమూ ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇవ్వకూడదని ఎక్కడా ఆదేశించలేదని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బందితో అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేసే అవకాశమున్నా.. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మురళీధర్‌రెడ్డి అభ్యంతరాలు చెబుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మురళీధర్‌రెడ్డి.. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి బంధువని, సీఎం జగన్‌పై నమోదైన సీబీఐ కేసుల్లో సహ నిందితుడని తెలిపారు. వైకాపాతో దగ్గరి సంబంధాలున్న ఆయన్ను ఈఆర్వోగా నియమించడంపై గతంలో అభ్యంతరం తెలిపినట్టు వివరించారు. ఎన్నికల వేళ తెదేపాను ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో వైకాపావారు మురళీధర్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తూ.. ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి మంగళవారం ఆయన లేఖ రాశారు.
source : eenadu.net
Discussion about this post