‘జగనన్న కాలనీల్లో ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 58 నెలల్లో 31 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో పలువురు లబ్ధిదారులకు ఆయన ఇళ్లస్థలాల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉచితంగా పంపిణీ చేసిన ఇంటి స్థలాలపై మహిళలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ కూడా చేసి హక్కు పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మరో పది రోజులపాటు కొనసాగుతుందన్నారు. ఇంటి పట్టాలు ఇవ్వడాన్ని తెదేపా కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటోందని ఆరోపించారు. నాడు- నేడు, విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 25 లక్షలకు పెంచామని, పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు కల్పించామని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయలేదని, ఇప్పుడు కొత్త మ్యానిఫెస్టోతో ఇంటింటికీ కిలో బంగారం, బెంజ్ కారు అనే హామీలతో మోసం చేసే ప్రయత్నం చేస్తారని విమర్శించారు.
సీఎం సభ పేరుతో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి 500 ఆర్టీసీ బస్సులు, ఉమ్మడి ప్రకాశంలోని ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 400 బస్సులు, మినీ వ్యాన్ల ద్వారా జన సమీకరణ చేశారు. వీరందరినీ సీఎం వచ్చే సమయానికి సభా ప్రాంగణానికి తెచ్చి వదిలేశారు. బస్సులను దూరంగా తీసుకెళ్లి నిలిపారు. సభా ప్రాంగణం నుంచి కొప్పోలు రోడ్డు వరకు పొలాల మధ్య మూడు కిలోమీటర్లు కొత్తగా వేసిన మట్టిరోడ్డు కావడంతో వాహనాల రాకపోకలతో పరిసరాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. ఏ బస్సు ఎక్కడుందో తెలియక మహిళలు రెండు గంటలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. నీళ్లు, ఆహారం లేక అవస్థలు పడ్డారు. సభకు రావాల్సిందేనంటూ బలవంతంగా తీసుకొచ్చారని, తీరా ఇక్కడ పట్టాలు ఇవ్వకపోగా భోజనమైనా పెట్టకుండా ఎండలో వదిలేశారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొందరు బస్సుల్లోనే ఉండిపోయారు. మరికొందరు సభకు వెళ్లకుండా బయటే కూర్చున్నారు. ఇంకొందరు సీఎం ప్రసంగిస్తుండగానే సభ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి వందల సంఖ్యలో బస్సులను కేటాయించడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటలపాటు బస్టాండ్లలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
source : eenadu.net
Discussion about this post