ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పిన జగన్.. గెలిచిన తర్వాత మాట తప్పారని మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినా వినకుండా మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారని తెలిపారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో మైలవరం నియోజకవర్గ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అక్కడ, అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలో వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీలో చేరేదీ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తెదేపా, కాంగ్రెస్, జనసేన, భాజపాల నుంచి ఆహ్వానాలు వచ్చాయని తెలిపారు.
రాజధాని మార్చొద్దని చెబితే.. కొడాలి, అంబటి అడ్డుతగిలారు
‘‘2019 ఎన్నికల ముందు రాజధానిపై మన వైఖరి ఏంటని నేను జగన్‌ను కలిసి అడిగా. ‘అసెంబ్లీలో కూడా చెప్పానుగా… ఇల్లు, కార్యాలయం ఇక్కడే కట్టుకుంటున్నాం. మనల్ని విమర్శించే వారికి ఇక్కడ ఇల్లు లేదు. వారికి మనల్ని విమర్శించే హక్కు ఎక్కడిది’ అన్నారు. ఈ ధీమాతోనే నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక.. రాజధాని ఇక్కడే ఉంటుందని గట్టిగా చెప్పాను. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టినరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. దీనిలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని సమర్థించాలని కోరారు. ఈ నిర్ణయం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పా.
కనీసం కార్యనిర్వాహక వ్యవస్థను ఇక్కడ ఉంచి, అసెంబ్లీని విశాఖకు పంపితే కొంతవరకు నష్టనివారణ చేయొచ్చని వివరించా. దీనికి కొడాలి నాని, అంబటి రాంబాబు అడ్డు తగిలారు. సీఎం నివాసంలోనే కూర్చుని ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించే దమ్ము, ధైర్యం ఉందా అన్నారు. ఇంతలో మంత్రి బొత్స కల్పించుకుని అభిప్రాయాన్ని చెప్పనివ్వాలని సర్దిచెప్పారు. అమరావతి ప్రాంతంలోని 33 నియోజకవర్గాల్లో 29 స్థానాల్లో వైకాపా గెలిచింది. అయినా ఒక ప్రాంతంపై విద్వేషంతో రాజధాని మార్చారు. వైకాపాలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాను. రోజూ గ్రూపులు ప్రోత్సహించి, ఇబ్బందులకు గురిచేశారు. సొంతపార్టీ వాళ్లే కొండపల్లి మున్సిపాలిటీలో ఓడించారు. మంత్రి జోగి రమేష్ సోదరుడికి ఛైర్మన్ సీటు ఇవ్వలేదని పార్టీని ఓడించారు.’’
జగన్‌కు చెప్పినా పట్టించుకోలేదు..
‘‘రాజకీయ ప్రత్యర్థి కంటే సొంత పార్టీలోని వారే మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి చెప్పాను. పెద్దిరెడ్డి మాత్రమే సానుకూలంగా స్పందించారు. మైలవరంలో నీ జోక్యం ఎందుకని మంత్రి జోగికి చెప్పినా ఆయన మారలేదు. సీఎం జగన్ వద్దకు 50 మంది నాయకులను తీసుకెళ్లి చెప్పినా స్పష్టత ఇవ్వలేదు. 2024లో నిన్ను గెలిపించి తీసుకొచ్చే బాధ్యతను అతని చేతిలో పెడతానని చెప్పడం నన్ను తీవ్రంగా బాధించింది.’’
వైనాట్ 175 నినాదం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
‘‘సీఎం జగన్ వైనాట్ 175 అనే నినాదంతో ప్రతిపక్షమే ఉండకూడదు అనుకోవటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. కుప్పంలోనూ కాంగ్రెస్‌పార్టీ గెలవాలని వైఎస్ రాజశేఖరరెడ్డి అనుకునేవారు తప్ప.. ప్రతిపక్షం ఉండకూడదని ఏనాడూ అనుకోలేదు. సీఎం జగన్‌కు.. వైఎస్‌ఆర్‌కు చాలా తేడా ఉంది. వైఎస్‌ఆర్ మాట తప్పరు. దీనికి పూర్తి విరుద్ధంగా సీఎం ఉన్నారు.’’
source : eenadu.net
Discussion about this post