‘‘నీళ్లు, వ్యవసాయం, పెట్టుబడులు, విద్య, ఉద్యోగాలపై దృష్టిపెడితే ఉమ్మడి అనంత జిల్లాతో పోటీ పడే ప్రాంతం భారతదేశంలోనే లేదు. నీరు తెస్తే ఇక్కడ వ్యవసాయాభివృద్ధితో పాటు పెద్దసంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. నీరు తీసుకురావడం వల్లే కియా పరిశ్రమ వచ్చింది. గొల్లపల్లి నిర్మించడం వల్ల కియాతో పాటు సాగు, తాగునీరు అందించాం. ఇప్పటివరకు కియాలో లక్షల కార్లు తయారై దేశవిదేశాల్లో తిరుగుతున్నాయి. తెదేపా ఇంకో ఐదేళ్లు అధికారంలో ఉండి ఉంటే జిల్లా మొత్తం పరిశ్రమలు వచ్చేవి.’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం పెనుకొండలో జరిగిన రా కదలిరా సభలో మాట్లాడారు. ప్రపంచంలోని పండ్ల రకాలన్నీ అనంతపురంలో పండించవచ్చన్నారు. అందుకే బిందుసేద్యాన్ని తీసుకొచ్చి పండ్ల తోటల పెంపకాన్ని పెద్దమొత్తంలో ప్రోత్సహించామన్నారు. 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందించామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలెడ్జ్ హబ్, సైన్స్ సిటీ పేరుతో వేలాది ఎకరాలు సేకరించారు. అయితే ఇప్పటివరకు ఒక్క కంపెనీ, రూపాయి పెట్టుబడి రాలేదు. ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. అదే తెదేపా 600 ఎకరాలు సేకరించి అక్కడ కియా పరిశ్రమను తీసుకొచ్చాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇద్దరికీ తేడా మీరే గమనించండి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. మళ్లీ తెదేపా అధికారంలోకి రాగానే వెనక్కి వెళ్లిన కంపెనీలన్నింటినీ తిరిగి తీసుకొస్తామన్నారు. గోదావరి జలాలను రాయలసీˆమకు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామన్నారు. గోరంట్లకు సాగునీరు ఇస్తామన్నారు.
హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెనుకొండలో మొన్నటివరకు శంకరనారాయణ తమ్ముళ్లను అడ్డుపెట్టుకుని వందల ఎకరాలు దోచేశారన్నారు. పెన్నానది నుంచి ఇసుకను బెంగళూరుకు అక్రమ రవాణా చేశారు. ఇప్పుడు ఆయన్ను అనంతపురం బదిలీ చేయగా.. కళ్యాణదుర్గంలోని మంత్రిని పెనుకొండకు తీసుకొచ్చారన్నారు. కళ్యాణదుర్గంలో సర్వం దోచేసిన ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడి చెత్త ఇక్కడ బంగారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ అంటూనే కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎర్రగుట్టను మింగేసి విలాసవంతమైన ఫాంహౌస్ నిర్మించుకుని గుర్రపు స్వారీ చేస్తున్నారని ఆరోపించారు. కదిరి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి లేఅవుట్ల నుంచి ఎకరాకు రూ.10 లక్షలు వసూలు చేశారు. లక్ష్మీనరసింహస్వామి కోనేరు అభివృద్ధి పనుల్లో నిధులు కాజేసి దేవుడికే శఠగోపం పెట్టారు. సోలార్‌పార్కు యజమానుల్ని బెదిరించి డబ్బులు లాక్కున్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఓ అవినీతి పుట్ట అని చంద్రబాబు ఆరోపించారు. సొంతపార్టీ కార్యకర్తలను కూడా వదల్లేదన్నారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి నియోజకవర్గానికి పట్టిన రోగమని చంద్రబాబు విమర్శించారు. ఇసుక దందాలో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. ముడుపులు ఇస్తే తప్ప ఏ పని చేయరని తెలిపారు.
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి దౌర్జన్యాలు, దోపిడీలోనే తోపు. అభివృద్ధిలో మాత్రం శూన్యం. దౌర్జన్యంగా భూముల్ని లాక్కున్నట్లు తెలిపారు. చెన్నేకొత్తపల్లిలో ఓ రైతు భూమి ఇవ్వకపోతే రాత్రికి రాత్రి మామిడి చెట్లు నరికేశారని ఆరోపించారు. నా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. జాకీ పరిశ్రమ పారిపోయేలా చేసి 6 వేల మందికి ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ అప్పులు పుడితే గాని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. నాయకులు భూ, ఇసుక మాఫియాతో రూ.వేల కోట్లు కొల్లగొడుతున్నారు. జగన్ సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం.. తల్లిని, చెల్లిని గెంటేసి బాబాయిని చంపిన నిందితులను కాపాడుతూ వారికి ద్రోహం చేశావు. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. తెదేపా శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి మాట్లాడుతూ వెనుకబడిన పెనుకొండ ప్రాంతానికి కియా కార్ల కంపెనీ, పలు అనుబంధ పరిశ్రమలు తీసుకువచ్చి 50 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. పార్టీ పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థి సవిత మాట్లాడుతూ ఏటా కరవుతో అల్లాడిపోతున్న పెనుకొండ ప్రాంతానికి గొల్లపల్లి జలాశయం ద్వారా హంద్రీనీవా నీటిని తీసుకువచ్చి ప్రజల తాగునీరు, రైతుల పంటలకు సాగునీటిని అందించిన అపర భగీరథుడు చంద్రబాబు అన్నారు.
source : eenadu.net
Discussion about this post