అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి డా. బాబు జగ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని నవోదయ కాలనీలో డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. సందర్భంగా డా.బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అతి చిన్న వయసులోనే స్వాతంత్ర సమరంలో పాల్గొని, పోరాటంలో నాయకత్వం వహించి సమసమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారిలో చైతన్యం తెచ్చేందుకు అనేకమైన పోరాటాలు చేసిన పోరాటయోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ అని చెప్పారు. డా.బిఆర్. అంబేద్కర్ రాజ్యాంగపరంగా దళితులకు, అణగారిన వర్గాలకు హక్కులు కల్పిస్తే అవి చట్టరూపంగా మార్చి అమలు పరచడంలో అనేక కష్టాలు ఎదుర్కొని, దళితులను చైతన్యవంతం చేసి జాగృతి వైపు నడిపించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కు దక్కుతుందన్నారు. చిన్న వయస్సులోనే శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులను చేపట్టి గొప్ప రాజకీయవేత్తగా ఎదిగాడన్నారు. రాష్ట్రంలో బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలనను సాగిస్తున్నారని చెప్పారు. అణగారిన వర్గాలకు చదువు వచ్చినప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని భావించి ఉన్నత చదువులు ఎవరికి ఆర్థికభారం కల్పించకుండా సీఎం వైఎస్ జగన్ విద్యకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా పేదలకు మంచి వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ లో అనేక మార్పులను తీసుకురావడమే కాకుండా కార్పొరేట్ కు దీటుగా ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాడని తెలిపారు.

Discussion about this post