శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడిన ఆచార్య మాకం కృష్ణమూర్తి శ్రీధర్‌ను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈ విషయం తెలియటంతో కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య వర్గీయులు, అతని స్నేహితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శుక్రవారం మిఠాయిలు పంచారు. హిందూపురం పట్టణంలో జన్మించిన ఈయన పుట్టుకతోనే పోలియో బాధితుడు. దాన్ని జయించి కష్టపడి డిగ్రీ వరకు ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. బెంగళూరు సెంట్రల్ కళాశాలలో కామర్స్ అధ్యాపకుడిగా విధులు నిర్వహించి కళాశాల ప్రధానాచార్యులుగా ఉద్యోగ విరమణ చేశారు. ఎంకేఎస్‌గా పిలవడే ఈయన ఏబీవీపీలో కొంతకాలం కొనసాగారు. మేనేజ్‌మెంట్ విభాగంలో స్ఫూర్తిదాయకమైన ఆచార్యులుగా పరిశోధకుడు, ఇనిస్ట్యూట్ బిల్డర్‌గా వేలామంది విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచారు. నాలుగు దశాబ్దాలు బెంగళూరు విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్ స్టడీ విభాగానికి ప్రొఫెసర్, డీన్, డైరెక్టర్‌గా పనిచేశారు. 2009 నుంచి 2013 వరకు కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ మెంబర్ సెక్రేటరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. నేషనల్ ఎడ్యుకేషన్‌పాలని డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడిగా, ఆల్ ఇండియా బోర్డ్‌ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఏఐసీటీఈ సభ్యుడిగా కొనసాగారు. ప్రస్తుతం యూజీసీ న్యూదిల్లీ సభ్యుడిగా, సెంట్రల్ విశ్వవిద్యాలయం ఆఫ్ కేరళ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌గా కొనసాగుతున్నారు. ఇతనికి కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ నుంచి జనరల్ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్‌తో సత్కరించింది. ప్రస్తుతం బెంగళూరు సమీపంలో ఏర్పాటు చేస్తున్న చాణక్య విశ్వవిద్యాలయానికి ఛాన్సులర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంకేఎస్‌కు పురస్కారం రావటంతో అతని కుటుంబ సభ్యులు దాసాగంగాధర్, బైసాని రామప్రసాద్‌లు హర్షం వ్యక్తం చేశారు.
source : eenadu.net
Discussion about this post