వైకాపా నాయకులు ఆ ఊరి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. అధికార పార్టీ నాయకులు వస్తే గ్రామస్థులు ఐక్యంగా నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన అధికార పార్టీ నాయకులు ఆ గ్రామానికి వెళ్లకుండానే వెనుదిరిగారు. శింగనమల నియోజకవర్గంలో వైకాపా సమన్వయకర్త వీరాంజనేయులు పరిచయ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి చేపట్టారు. అందులో భాగంగానే వారు మండలాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం శివపురం నుంచి ఈస్టు నరసాపురం వరకు కార్యక్రమం చేపట్టారు. నాయకులు ఉల్లికల్లు గ్రామానికి వెళ్లకుండానే పక్క గ్రామం కొరివిపల్లికి వెళ్లారు. ఉల్లికల్లు గ్రామం చాగళ్లు రిజర్వాయర్ మునక కింద ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామానికి ఆర్‌అండ్‌ఆర్ నిధులు మంజూరు చేయిస్తామని గత ఎన్నికల ప్రచారంలో నాయకులు హామీనిచ్చారు. గ్రామాన్ని పునర్నిర్మిస్తామని నమ్మించారు. ఐదేళ్లుగా కాలం దాటేస్తూ వచ్చారు. గ్రామానికి కనీసం ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఈ విషయంపై గ్రామస్థులు ఎమ్మెల్యే పద్మావతి, భర్త సాంబశివారెడ్డిపై మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్తే ప్రజలు అడ్డుకొని, వాదనలకు దిగుతారని భావించిన వైకాపా నాయకులు ఉల్లికల్లుకు వెళ్లకుండానే పక్క గ్రామం కొరివిపల్లి వరకు వెళ్లి వచ్చారు.
source : eenadu.net
Discussion about this post