‘‘నాన్న హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న నేను ప్రజల సహకారం కోరుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా శక్తిని చూపెట్టాలి. పార్టీలకు అతీతంగా ప్రజలంతా మద్దతివ్వాలని కోరుతున్నా. నేను ఒక కారణం కోసం మద్దతు కోరుతున్నాను తప్పితే రాజకీయాల కోసం కాదు. బలవంతులను ఎదుర్కొని బాధితులకు న్యాయం చేయగలిగితే సమాజంలో మార్పు వస్తుందని నమ్ముతున్నా. అందుకే జగన్‌కు ఓటేయొద్దని కచ్చితంగా చెబుతున్నా. ఎప్పుడూ పరిపాలనలో హత్యా రాజకీయాలు ఉండకూడదు. హంతకులు మనల్ని పాలించకూడదు. వారికి అలాంటి అవకాశం ఇవ్వకూడదు. సమాజాన్ని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కావాలి. సమాజాన్ని అన్ని కోణాల్లో ఉత్థానపరిచే ప్రజాస్వామ్యం రావాలి. అందువల్ల దయచేసి మా అన్న మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓటేయొద్దని కోరుతున్నా. ఆయనకు ఓటేస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ ఉండదు. వంచన, మోసంతో కేవలం తన అనుకున్నవారికే సాయం చేసి, మిగిలినవారికి అన్యాయం చేసే పార్టీకి ఓటేయొద్దు’’ అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. తన తండ్రి హత్య జరిగి ఈ నెల 15 నాటికి అయిదేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకూ దర్యాప్తు పూర్తి కాకపోవడం, కోర్టులో ట్రయల్ ప్రారంభం కాకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ ఆమె శుక్రవారం ఇక్కడి కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అంతిమ కుట్రదారులను తేల్చాలని డిమాండ్ చేశారు. అవినాష్‌రెడ్డికి ఇందులో శిక్షపడాలని, తప్పుచేసిన వారు తప్పించుకోకూడదని అభిప్రాయపడ్డారు.
గతంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి దిల్లీ వచ్చినప్పుడు ప్రస్తుత తితిదే ఈఓ ధర్మారెడ్డి నేనున్న చోటికి వచ్చి ఎన్నికల సంఘం కార్యాలయానికి తీసుకెళ్లారు. వారు చేసే సాయాన్ని చూసి దానివెనకున్న దురుద్దేశాలను అర్థం చేసుకోలేకపోయాం. కాలగమనంలో ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాలని హైకోర్టులో మా అమ్మ కేసు దాఖలుచేయడం… దానికి మద్దతు పలుకుతూ జగన్ కూడా కేసు దాఖలు చేయడంతో అంతా సరైన దిశలోనే జరుగుతోందని భావించాం.
రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక ఈ కేసును సీబీఐకి ఇచ్చే విషయంలో ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోమని అడగడానికి వెళ్లినప్పుడు ఆయన స్పందించిన తీరు నాకు కొంత నమ్మకం కలిగించింది. ‘చిన్నాన్నను చంపిన వారిని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? హంతకులెవరైనా పట్టుకొని తీరుతాం’ అని చెప్పారు. ఆ మాటల వెనుక మోసం, వంచన ఉన్నాయన్న ఆలోచన నాకు రాలేదు. సమయం గడిచే కొద్దీ ఆయన చుట్టుపక్కల ఉన్నవారి పట్ల అనుమానాలు వెలువడ్డాయి. ఆగస్టు 8న మా నాన్న జయంతి రోజున ఆయన విగ్రహావిష్కరణతో పాటు, కియా ఫ్యాక్టరీ ప్రారంభానికి జగన్ రావాలి. అయితే ఆ రెండింటికీ జగన్ రాలేదు. మా నాన్న విగ్రహావిష్కరణకు హాజరు కావాల్సి వస్తుందని కియా పరిశ్రమ ప్రారంభోత్సవానికీ రాలేదు.
source : eenadu.net
Discussion about this post