ఎవరితోనైనా దొంగాటలు ఆడగల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. సొంత పార్టీలోని సీనియర్ నేతలకు టికెట్లు ఎగ్గొట్టడానికీ తొండాట ఆడుతున్నారు. ఇందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మరోసారి పావుగా చంద్రబాబు వాడుకుంటున్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు చెప్పగానే తలాడించే పవన్.. ఇప్పుడూ అదే పని చేశారు.
2014 ఎన్నికల తర్వాత తనను తిట్టారంటూ పలువురు టీడీపీ సీనియర్ నేతల పేర్లతో పవన్‌తో ఓ జాబితా తయారు చేయించి, వారికి సీట్లిస్తే జనసేన ఓట్ల బదలాయింపు జరగదని ఓ మాట చెప్పించారు. దానినే ప్రచారం చేయించారు. పవన్ ఒత్తిడి ఉందని, పొత్తులో ఇలా ఒకట్రెండు అంశాల్లో సర్దుకుపోకతప్పదంటూ చంద్రబాబు పార్టీ నేతల అమాయకత్వం ఒలకబోసి, తాను అనుకున్న పలువురికి టిక్కెట్లు ఎగ్గొడుతున్నట్లు పార్టీలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది.
టీడీపీ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ ఇచ్చిన ఈ జాబితాలో సీనియర్లు చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, మరో నలుగురు ఉన్నారు. వారికి సిట్లిస్తే జనసేన నుంచి ఓట్ల బదలాయింపు జరగదని పవన్‌తో చంద్రబాబు చెప్పించారు.
ఈ నాయకుల విషయంలో తన మాట వినాల్సిందేనని పవన్ కోరినట్లు ప్రచారం చేశారు. పొత్తులో భాగంగా ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరించినట్లు ప్రచారం చేశారు. జనసేనతో పొత్తు కొనసాగాలంటే ఒకట్రెండు అంశాల్లో పవన్ చెప్పినట్లు వినక తప్పడంలేదంటూ నేతల ముందు చంద్రబాబు అమాయకత్వం ఒలకబోశారు. ఇలా ఏడుగురు నేతలకు చంద్రబాబు సీట్లు నిరాకరించారు.
ఈ ముగ్గురికీ ఇలా
చంద్రబాబు తొండాటలో టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టిక్కెట్ కోల్పోతున్నారు. దెందులూరు సీటును ఈసారి ప్రభాకర్‌కి కాకుండా వేరొకరికి ఇవ్వడానికి బాబు నిర్ణయించారు. 2014 ఎన్నికల తర్వాత జనసేన సహకారంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందనే వాదనను ప్రభాకర్ తిప్పికొట్టారు. అసలు జనసేనకు బలం ఎక్కడుందని ప్రశ్నించారు. పవన్‌పై వ్యక్తిగతంగానూ విమర్శలు చేశారు. దీన్ని సాకుగా చూపి, పవన్ ముసుగులో ప్రభాకర్‌కి బాబు మొండి చేయి చూపించారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పవన్‌పై గతంలో విమర్శలు చేశారన్న సాకుతో ఆయనకూ మొండి చేయి చూపించారు.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేన ఖాతాలో వేశారు. తద్వారా బుచ్చయ్య చౌదరిని పక్కకు తప్పిస్తున్నారు. మరో టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడూ గతంలో పవన్‌పై వెటకారంగా మాట్లాడారు. ఆయన కుమారుడు విజయ్ టీడీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు పవన్‌ను ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించారు.
source : sakshi.com
Discussion about this post