తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. తమ నేతకు సీటు ఇవ్వకపోవడంతో తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు చించివేశారు. రోడ్లపైనే దహనం చేశారు. చంద్ర బాబు ఏకపక్ష నిర్ణయంపై మండిపడ్డారు. డబ్బుకు అమ్ముడుపోయారటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున శింగనమల నియోజకవర్గ బరిలో నిలిచి ఓడిపోయిన బండారు శ్రావణికే మళ్లీ టికెట్ ప్రకటించడంపై ఆ పార్టీ శింగనమల టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు వర్గీయులు రెచ్చిపోయారు. అనంతపురంలోని టీడీపీ కార్యాలయంపై శనివారం సాయంత్రం దాడి చేశారు. కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. కార్యాలయ ఆవరణలో కట్టిన ఫ్లెక్సీలను చించేశారు. చంద్రబాబు డౌన్ డౌన్… నారా లోకేష్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నియోజకవర్గంలో టీడీపీని బండారు శ్రావణి నాశనం చేసిందన్నారు. 90 శాతం పార్టీ కేడర్ ఆమెను వ్యతిరేకిస్తోందన్నారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బండారు శ్రావణిని గెలవనివ్వమని స్పష్టం చేశారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా అభ్యర్థిని బరిలో దింపుతామన్నారు. అధిష్టానానికి తమ సత్తా ఏంటో చూపుతామన్నారు. బండారు శ్రావణిని మార్చకుంటే పార్టీని వీడతామని హెచ్చరిస్తూ ఆమె వ్యతిరేక వర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు చంద్రబాబుకు లేఖ రాశారు.
మడకశిర టీడీపీ అసెంబ్లీ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు డాక్టర్ సునీల్‌కుమార్‌కు కేటాయించడంపై నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గం మండిపడింది. టికెట్ ప్రకటించగానే మాజీ ఎమ్మెల్యే ఈరన్న, తనయుడు సునీల్‌కుమార్‌లు గుండుమల తిప్పేస్వామి మద్దతు కోరడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ గుమిగూడిన గుండుమల అనుచరులు వారిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. తలుపులు మూసేసి..ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని దూషిస్తూ చెప్పులు విసిరారు.
source : sakshi.com
Discussion about this post