‘సీఎం జగన్ ఇళ్లపట్టాల పంపిణీకి ఒంగోలు వస్తున్నారు. డ్వాక్రా మహిళలంతా రావాల్సిందే. రానంటే కుదరదు. స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారైతే భార్యా భర్తలిద్దరూ హాజరుకావాలి’ అంటూ డ్వాక్రా గ్రూపు మహిళలపై ఆర్‌పీలు ఒత్తిడి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం వస్తున్నారు. ఈ సభకు భారీ జన సమీకరణపై అధికార పార్టీ వైకాపా దృష్టి పెట్టింది. డీఆర్డీఏ, మెప్మా అధికారులు, సిబ్బంది ద్వారా స్వయం సహాయక సంఘ మహిళలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సభకు రాకపోతే పథకాలు ఆగిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఒంగోలు నగరానికి చెందిన సుమారు 24 వేలమందికి ఎన్.అగ్రహారం పరిధిలో పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి లబ్ధిదారులు కాకున్నా సరే, మహిళలంతా హాజరుకావాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారు. స్థలం పొందిన కుటుంబాల్లోని మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంట్లు, షర్టులు ఇస్తారంటూ కొన్నిచోట్ల ప్రచారం చేస్తున్నారు.
ఇళ్లపట్టాల పంపిణీ సభకు కేవలం స్థానిక లబ్ధిదారులనే కాకుండా పొరుగునే ఉన్న సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల నుంచి కూడా భారీ సమీకరణకు ప్రణాళిక రూపొందించారు. ఒంగోలులోని యాభై డివిజన్లతో పాటు ఒక్కొక్క మండలానికి 20 నుంచి 30 బస్సులను పంపారు. ఇందుకోసం ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి 500 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. జిల్లావ్యాప్తంగా 400కు పైగా పాఠశాల/కళాశాల బస్సులను కూడా సిద్ధం చేశారు. దీంతో ఆయా పాఠశాలలు, కళాశాలలు సెలవు ప్రకటించాల్సి వచ్చింది.
సీఎం పాల్గొంటున్న ఈకార్యక్రమానికి ఫొటో, వీడియో జర్నలిస్టులకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసిన విలేకరులను మాత్రమే అనుమతిస్తామని సమాచార, పౌరసంబంధాల శాఖ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
source : eenadu.net
Discussion about this post