ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటనలో మద్యం పరవళ్లు తొక్కింది. సభకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వాహనాలను కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న రాజుపేట వైన్ షాపులు, బార్ వద్ద ఆపి మరీ మద్యం సరఫరా చేశారు. వందల మంది రోడ్లపై మద్యం తాగుతూ కన్పించారు. బస్సుల్లోనూ తాగడంతో మహిళలు ఇబ్బంది పడ్డారు. ఆకలితో అలమటించిన పలువురు దారిలో శాంతిపురంలోని అన్న క్యాంటీన్‌లో భోజనాలు చేశారు.
సీఎం జగన్ తొలుత హెలికాప్టర్‌లో గుండిశెట్టిపల్లికి వచ్చి, అక్కడి నుంచి సభాస్థలికి వాహనంలో చేరుకున్నారు. 1.5 కి.మీ దూరం రహదారికి ఇరువైపులా బారికేడ్లు పెట్టి, ఆవల మహిళలను గంటన్నర పాటు నిల్చోబెట్టారు. వారితో జగన్‌పై పూలు చల్లించారు. సీఎం ప్రసంగం ప్రారంభించిన పది నిమిషాల నుంచే సభా ప్రాంగణం ఖాళీ కావడం కన్పించింది. పోలీసులు అడ్డుకున్నా, ససేమిరా అని జనం వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివ ఫొటోలు తీస్తుండగా, వైకాపా కార్యకర్తలు ఆగ్రహిస్తూ కెమెరా లాక్కునేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని, తీసిన ఫొటోలు డిలీట్ చేయించారు. ఫొటోగ్రాఫర్‌ను పంపించారు.
సభ తర్వాత హెలిప్యాడ్ వద్ద వేసిన గుడారాల్లో జిల్లా నేతలతో జగన్ గంటపాటు చర్చించారు. పలమనేరు-కుప్పం రహదారిని ఉదయం నుంచి సాయంత్రం వరకూ మూసివేసి, సీఎం కాన్వాయ్‌ను నిలిపి ఉంచడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను సభకు మళ్లించడంతో.. సామాన్యులకు బస్సులు సరిపడా నడవలేదు. ఆటోలను ఆశ్రయించారు.
source : eenadu.net
Discussion about this post