ముఖ్యమంత్రి జగన్ సభ కోసం ఏకంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్ విద్యా మండలి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావు ప్రకటించారు. ఈనెల 3న పర్యావరణ విద్య పరీక్ష జరగాల్సి ఉంది. అదే రోజు ఏలూరు జిల్లా దెందులూరులో జగన్ ఎన్నికల సభ నిర్వహిస్తున్నారు. దీనికి జనాలను తరలించేందుకు బస్సులు కావాలనే ఉద్దేశంతో పరీక్షను ఈనెల 23కు వాయిదా వేశారు. పిల్లలకు మేనమామగా ఉంటానని కల్లిబొల్లి మాటలు చెప్పే సీఎం.. వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నైతికత-మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు ఉంటాయి. వీటిల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. నైతికత-మానవవిలువలు శుక్రవారం, పర్యావరణ విద్య పరీక్ష శనివారం జరగనున్నాయి. శుక్రవారం పరీక్షను యథావిధిగా ఉంచి.. శనివారం జరగాల్సిన దాన్ని వాయిదా వేశారు.
5లక్షల మంది విద్యార్థుల్లో ఆందోళన..
అకస్మాత్తుగా వాయిదా వేయడంతో.. ఈ పరీక్ష రాయనున్న 5లక్షలకుపైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. ఎన్నికల శంఖారావ సభకు సీఎం మధ్యాహ్నం 2.30గంటల తర్వాత చేరుకోనున్నారు. ఈలోపు జనాలను తరలించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో ఎలాంటి కారణం చూపకుండానే పరీక్షను వాయిదా వేశారు. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సభ కోసం పబ్లిక్ పరీక్షలను వాయిదా వేసిన పరిస్థితి దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. కరోనాలాంటి విపత్తులు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాయిదా వేస్తారు. కానీ జగన్ ప్రభుత్వంలో ఆయన బయటకు వస్తే బడులకు సెలవులు.. సభ నిర్వహిస్తే ఏకంగా పరీక్షలు వాయిదా వేయిస్తున్నారు.
source : eenadu.net
Discussion about this post