‘నాతో ఎవరు పొత్తు పెట్టుకోకున్నా నేను ఒంటరిని కాదు. పైన దేవుడున్నాడు. నాతో ప్రజలున్నారు’ అంటూ సీఎం జగన్ ప్రసంగాల్లో ఊదరగొడుతుంటారు. అది శుద్ధ అబద్ధమని శనివారం ఏలూరులో నిర్వహించిన సిద్ధం సభతో తేటతెల్లమైంది. జనాలకు జగన్‌పై అంత ప్రేముంటే ఏమీ ఆశించకుండా సభలకు రావాలి కాదా? జన సమీకరణకు వారం నుంచే ఎందుకు ఆపసోపాలు పడ్డారు? రాకుంటే పథకాలు కత్తిరిస్తామని వాలంటీర్లతో ఎందుకు బెదిరించారు? వచ్చిన వారికి డబ్బులు ఎందుకు ఇచ్చారు? మద్యం ఎందుకు తాగించారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సిద్ధం సభకు జనాన్ని తరలించాల్సిందిగా ప్రతి వాలంటీర్‌కు పార్టీ పెద్దలు లక్ష్యాన్ని నిర్దేశించారు. వారు వారం నుంచే తమ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జనాన్ని రప్పించేందుకు చాలాచోట్ల నాయకులు బతిమాలుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి 70 బస్సులు ఏర్పాటుచేయగా, కేవలం పది బస్సుల్లో, అదీ పల్చగా ప్రజలు వెళ్లారు. సీఎం ప్రసంగం మొదలయ్యే సరికే వెనకనున్న గ్యాలరీలు ఖాళీ కావటం మొదలైంది. ప్రసంగం సగం ముగిసేసరికి మరిన్ని గ్యాలరీలు బోసిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు, నాయకులు ముందు గ్యాలరీల్లో ఉన్నవారిని బయటికి రాకుండా అడ్డుకున్నారు.
పల్లెల నుంచి ఉదయం 8 గంటలకే బస్సులు బయల్దేరగా, మధ్యాహ్నానికి వేదిక వద్దకు జనం చేరుకున్నారు. అక్కడ మండుటెండలో ఉక్కపోతతో అల్లాడిపోయారు. పలువురు సొమ్మసిల్లి పడిపోగా, కొందరు వాంతులు చేసుకున్న దృశ్యాలు కనిపించాయి. ఓ పోలీస్ కానిస్టేబుల్ స్పృహతప్పి పడిపోగా, వైద్య శిబిరంలో సెలైన్ పెట్టారు. సభలో కుర్చీలు లేకపోవటంతో సాయంత్రం వరకూ నిల్చోలేక కొందరు సీఎం రాకముందే వెళ్లిపోయి బస్సుల్లో కూర్చున్నారు. మొత్తంగా సుమారు 3 వేల వాహనాలు ఏర్పాటు చేయగా, ఏలూరుకు వచ్చే అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఉదయం 11 గంటలకే దాదాపు 10 కిమీ మేర వాహనాలు ఆగిపోయాయి. సాయంత్రం సభ ముగిశాక 3 గంటల పాటు ట్రాఫిక్ సమస్య కొనసాగింది. చెన్నై-కోల్‌కతా హైవేపై సభాస్థలికి సమీపంలో ఓ చోట డివైడర్‌ను పగులగొట్టారు. సభ ప్రాంతంలో పిల్ల కాలువను కొంత పూడ్చేశారు. ఏలూరులో జగన్ ఫ్లెక్సీలు కన్పించేందుకు చెట్ల కొమ్మలు కొట్టేశారు. విద్యారంగాన్ని సంస్కరిస్తున్నామని చెప్పే సీఎం.. తన సభ కోసం ఇంటర్ పబ్లిక్ పరీక్షను వాయిదా వేయించారు. ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేసి మరీ, సుమారు వెయ్యి బస్సులు తీసుకొన్నారు.
సీఎం కార్యక్రమంలో మీడియాపై ఆంక్షల కత్తిపెట్టారు. కార్యక్రమ కవరేజీకి వైకాపా ఏలూరు జిల్లా కార్యాలయంలో కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులకే ప్రవేశ పాసులు ఇచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహా న్యూస్ తదితర మీడియాల్లోని ప్రతినిధులకు పాస్‌లు ఇవ్వలేదు. ఆయా సంస్థలకు పాస్‌లు ఇస్తే చర్యలు దారుణంగా ఉంటాయని అధిష్ఠానం నుంచి హెచ్చరికలు వెళ్లినట్లు తెలుస్తోంది.
source : eenadu.net
Discussion about this post