లారీ, టిప్పర్ డ్రైవర్ల తరఫున చట్టసభలో ఒక ప్రతినిధి ఉండాలని అడిగిన వెంటనే ఒక టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. చట్టసభల్లో కూర్చోబెట్టేందుకు మడకశిరలో మాదిగ సామాజికవర్గానికి చెందిన వీరాంజనేయులును అక్కడ నిలబెట్టినట్లు తెలిపారు. గురువారం మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పొయ్య గ్రామం వద్ద లారీ, టిప్పర్, ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. టిప్పర్ వృత్తి వర్గానికి చెందిన వ్యక్తి చట్టసభల్లో కూర్చుంటే డ్రైవర్ల సమస్యలు తీర్చేందుకు ఆస్కారం ఉందన్నారు. అలాంటి వ్యక్తిని అవహేళన చేశారని పేర్కొన్నారు. వైకాపా వచ్చిన తర్వాత సొంతంగా ఆటోలు ఉన్న 3,93,655 మందికి వాహనమిత్ర ద్వారా రూ.1,296 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అవి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లకు, మరమ్మతులకు ఉపయోగపడతాయన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక టిప్పర్లు, లారీలు ఉన్న వారినీ ఈ జాబితాలోకి తీసుకొస్తామన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తికి చెందిన జ్యోతి తనకు సొంత ఆటో లేదని, వాహనం కొనుగోలుకు సహాయం చేయాలని కోరారు. బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలను ఇప్పించే ఆలోచన చేస్తామని మాత్రమే సీఎం చెప్పారు. ప్రమాద బీమా ఇప్పించాలని జయశంకర్ కోరగా దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ఏం చేయాలో ఆలోచిస్తామని సమాధానం ఇచ్చారు. తమకూ యూనిఫాం ఇవ్వాలని, ఆటోస్టాండ్ షెడ్లు నిర్మించాలని మరో ఆటోడ్రైవర్ కోరారు. దీనిపై సీఎం ఏం మాట్లాడలేదు. కాగా, శ్రీకాళహస్తి 16వ వార్డు జయరామారావు వీధికి చెందిన వాలంటీరు షేక్ ఖాదర్‌బీ ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
తిరుపతికి చెందిన సుధాకర్ అద్దె ఆటోలు నడుపుతున్నవాళ్లకు వాహనమిత్ర ఇవ్వాలని కోరినా సీఎం స్పందించలేదు. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయని.. తమ సమస్యలు, సూచనలు రాసి డబ్బాలో వేయాలని చెప్పి సమావేశాన్ని ముగించారు.
source : eenadu.net
Discussion about this post