ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అధికార యంత్రాంగాన్నీ ఒకటే అడుగుతున్నా. అధికార పార్టీ డ్రామాలు ఆడుతుంటే మీరు కూడా సహకరిస్తారా? ఒక్క నెల ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వలేనంత అసమర్థులా? గ్రామ సచివాలయాల్లో 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఒక గ్రామంలో సగటున 45 మంది పింఛనుదారులు ఉన్నారు. రోజుకు 20 మందికి పంపిణీ చేస్తే రెండ్రోజుల్లో ఇంటింటికీ వెళ్లి ఇచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాల మీద బురద చల్లడానికే ఇలా చేస్తున్నారు.
‘తెదేపా అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తేదీన ఇంటికే వచ్చి రూ.4,000 పింఛను ఇచ్చే బాధ్యత మాది. గత ఎన్నికల్లో తెదేపా గెలిచి ఉంటే మొదటి నెలలోనే రూ.3 వేల చొప్పున పింఛను ఇచ్చేవాళ్లం. జగన్ ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ రూ.3 వేలు ఇచ్చేసరికి దిగిపోతున్నారు. జగన్ వద్ద ఖజానా ఖాళీ అయిపోయింది. 3వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు’.
‘జగన్ నన్ను పశుపతి అని అన్నారు. పశుపతి అంటే విశ్వాన్ని రక్షించిన పరమశివుడు. మానవాళిని రక్షించడం కోసం గరళాన్ని మింగిన శివుడిలా.. ప్రజల కోసం నేను శివుడి అవతారమెత్తుతా. ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తా.. ఎన్ని దాడులు అయినా ఎదుర్కొంటా.. బుల్లెట్ మాదిరిగా దూసుకొస్తా.. ప్రజలను కాపాడే విషయంలో మాత్రం వెనక్కి తగ్గను. రాష్ట్రాన్ని జగన్ అనే రాక్షసుడి నుంచి కాపాడుకుంటా.’
‘2019లో బాబాయ్‌ను గొడ్డలితో చంపేసి సానుభూతితో గెలిచిన వ్యక్తి ఈ జగన్‌మోహన్‌రెడ్డి.. అవునా.. కాదా? ఇప్పుడు ఆయన చెల్లెలే చెప్పింది. నన్ను ఎన్నికల్లో పోటీ చేయమని వివేకా అడిగినందుకే చంపారని. ఆయన ఆత్మశాంతి కోసం పోటీ చేస్తానని చెప్పింది. అప్పట్లో బాబాయ్‌ను చంపి, కోడికత్తి డ్రామా ఆడి సానుభూతి పొందావు. ఇప్పుడు వృద్ధులను చంపేసి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా? కోడికత్తి కమల్‌హాసన్..’’
రావులపాలెంలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు
పేదలు, దివ్యాంగులు, వితంతువులకు నెలకు రూ.35 పింఛను ఇచ్చే పథకాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారని, 2014లో తెదేపా రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచిందని, మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4 వేలు ఇంటి వద్దే అందజేస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తాజాగా పింఛన్ల విషయంలో అధికార పార్టీ ఓట్ల కోసం నీచమైన రాజకీయం చేసే స్థాయికి దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, రామచంద్రాపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామలో బుధవారం నిర్వహించిన ‘ప్రజాగళం’ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. తెదేపా హయాంలో రూ.2 వేలు పింఛను అందుకున్న వృద్ధులకు అన్నక్యాంటీన్‌లో రూ.5కే భోజనం లభించేదని, నెలకు రూ.450తో మూడుపూటలా కడుపు నిండా తినేవారని, మిగిలిన డబ్బులతో గౌరవంగా బతికేవారని గుర్తు చేశారు. అలాంటి వృద్ధులతో ముఖ్యమంత్రి జగన్ శవరాజకీయాలు చేస్తూ దుర్మార్గమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారని మండిపడ్డారు.
source : eenadu.net
Discussion about this post