హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నిర్వహించిన పురపాలక సంఘం వార్డుల సమీక్ష సమావేశాలకు రహదారులే వేదికలయ్యాయి. శనివారం మేళాపురం కూడలి, రహమత్‌పూర్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపైనే సమీక్ష వేదికలు ఏర్పాటు చేయటంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహమత్‌పూర్ సమీక్ష సమావేశం వేదిక తొలుత నూతన రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా షామియానా ఏర్పాటు చేయటంపై రైల్వే అధికారులు ఆగ్రహించడంతో తొలగించారు. అనంతరం స్థానిక రహదారి ఒకవైపును బ్లాక్ చేసి వేదిక ఏర్పాటు చేశారు. దీనివల్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాకపోకలు సాగించేందుకు వాహనాలు ఇబ్బందులు పడ్డారు.
ఎనిమిది వార్డులకు ఒకచోట సభలు ఏర్పాటు చేశారు. ఈ సభలకు అధికంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరుకావాలి. అయితే ఏ సమీక్ష సమావేశం చూసినా మెప్మా మహిళలే అధికంగా కనిపించారు. సభకు రాకపోతే మీకు ప్రభుత్వ పథకాలు వర్తించవు.. బ్యాంకుల నుంచి రుణాలు అందవని సంబంధిత గ్రూపు నాయకులు ఆ గ్రూపు సభ్యులకు చెప్పి సమావేశాలకు తీసుకొచ్చినట్లు మహిళలే చెప్పటం గమనార్హం. పలుచోట్ల మంత్రి మాట్లాడుతుండగానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
source : eenadu.net
Discussion about this post