30 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించే అవకాశమున్నా సీఎం జగన్ ఆ పని చేయలేదు. 6వేల పోస్టులతో దగా డీఎస్సీని ప్రకటించారు. అందుకే జగన్‌ను దగా సీఎం అంటున్నాం. ఇప్పుడు చలో సెక్రటేరియట్‌కు పిలుపిచ్చాం. త్వరలో తాడేపల్లి ప్యాలె్‌సనూ టచ్ చేస్తాం’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు. గత ఎన్నికలతోపాటు జగన్ పాదయాత్రల సందర్భంగా ఇచ్చిన హమీ మేరకు 23వేల ఉపాధ్యాయ పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ కావాలంటూ పీసీసీ గురువారం తలపెట్టిన ‘చలో సెక్రటేరియేట్’ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. విజయవాడలోని పీసీసీ కార్యాలయమైన ఆంధ్రరత్న భవన్ చుట్టూ పోలీసులు బుధవారమే మోహరించారు. మూడంచెల భద్రతను ఏర్పాటుచేసి.. భవన్‌కు వెళ్లే మార్గాన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో షర్మిల బుధవారం రాత్రి భవన్‌లోనే మకాం వేశారు. గురువారం ఉదయం కార్యాలయం నుంచి బయటకు వస్తే అరెస్టు చేయాలని పోలీసులు భావించారు. ఇది తెలిసి షర్మిల కార్యాలయం ఆవరణలోనే ధర్నాకు దిగారు. సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు, సీనియర్ నేతలు తులసిరెడ్డి, సుంకర పద్మశ్రీ, షేక్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. గంటకు పైగా షర్మిల ధర్నా చేశారు.
పోలీస్ కంట్రోల్ రూం వరకు ఆమె చేసే పాదయాత్రను అడ్డుకోకూడదని పోలీసులు భావించారు. నేతలు, కార్యకర్తలతో కలిసి ఆమె కంట్రోల్ రూం వరకు ర్యాలీ నిర్వహించారు. ఏలూరు రోడ్డులో చల్లపల్లి బంగ్లా వద్ద బైఠాయుంచి కొద్దిసేపు ధర్నా చేశారు. అనంతరం పోలీసు కంట్రోల్ రూం వద్ద బైఠాయించారు. అక్కడి నుంచి వాహనాల్లో అమరావతి సచివాలయానికి బయల్దేరారు. ఉండవల్లి కరకట్ట మీద కొండవీడు ఎత్తిపోతల పథకం వద్ద తాడేపల్లి పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీస్ జవహర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు ససేమిరా అనడంతో వాగ్వాదం, తోపులాట జరిగాయి. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టుచేసి వ్యాను ఎక్కించారు. దీనిని నిరసిస్తూ షర్మిల వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు చర్యలకు నిరసనగా కరకట్ట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు ఆమెను కూడా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యానెక్కించారు. ఈ పెనుగులాటలో ఆమె చేతికి గాయమైంది. వారందరినీ మంగళగిరి పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. షర్మిలతోపాటు అరెస్టు చేసిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, షేక్ మస్తాన్‌వలి, సుంకర పద్మశ్రీ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో మంగళగిరి స్టేషన్ చేరుకుని, ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం తర్వాత వారిని విడుదల చేశారు.
source : andhrajyothi.com
Discussion about this post