ఎన్నికల్లో రిగ్గింగ్‌పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. నోటికొచ్చినట్లు దూషించారు. కొట్టారు.. హింసించారు. పశువుల కొట్టంలో బంధించారు. అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తూ.. వారికి శిరోముండనం చేయించారు. అయినా కసి తీరక వారి కనుబొమలూ తీయించేశారు. సభ్యసమాజం తలదించుకునే రీతిలో ఇంతటి అమానవీయ చర్యలకు పాల్పడింది ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ, మండపేట అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో 1996 డిసెంబరు 29న చోటుచేసుకున్న ఈ దారుణం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వైకాపా అధికారంలోకి వచ్చాక.. 2019 నుంచి వారిపై వేధింపులు కొనసాగాయి. 1994 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తోట త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్‌కు పాల్పడుతుండగా అడ్డుకున్నందుకే తమపై కక్షపూరితంగా వ్యవహరించారనేది బాధిత యువకుల ఆవేదన. సొంత ఊళ్లో వారి ఆధిపత్యానికి అడ్డు తగులుతున్నారని ఆగ్రహించిన త్రిమూర్తులుతోపాటు మరికొందరు తమపై అమానుష రీతిలో దాడి చేసి హింసించారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కోటి చినరాజు, దడాల వెంకటరత్నం, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభిరామయ్య, పువ్వల వెంకటరమణ (చనిపోయారు) అనే అయిదుగురిపై దాడి చేయగా.. వారిలో చినరాజు, వెంకటరత్నంలకు శిరోముండనం చేసి, కనుబొమలు సైతం తీయించేసినట్లు అప్పట్లో కేసు నమోదైంది. అయితే వారు ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డారని, గ్రామ ప్రధాన కూడలి వద్ద అమ్మాయిలపై అసభ్యకరమైన రాతలు రాశారంటూ ఆ ఇద్దరిపై ఈవ్ టీజింగ్ కేసు పెట్టించారు. మిగిలిన వారిపై కంచె స్తంభాలను ధ్వంసం చేశారని కేసు పెట్టారు.
దళిత యువకులపై అకృత్యానికి పాల్పడిన నిందితుల్లో క్షురకుడు మినహా మిగిలినవారంతా తోట త్రిమూర్తులు బంధుగణం, అనుచరులు కావడం గమనార్హం. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి త్రిమూర్తులు గెలిచారు. 1996 డిసెంబరు 29న ఆయన నివాసం దగ్గరే శిరోముండనం ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో మొత్తం 24 మంది సాక్షులుగా ఉండగా వయసు మీరడం, అనారోగ్య కారణాలతో 11 మంది మృతిచెందారు. 13మంది మిగిలారు. ప్రధాన సాక్షి కోటి రాజు(58) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. అయిదుగురు బాధితుల్లో ఒకరు చనిపోయారు.
source : eenadu.net
Discussion about this post