అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును మార్చకపోతే ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం శింగనమల మండలంలోని శివపురం పెద్దమ్మ ఆలయం వద్ద పార్టీ అసమ్మతి నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఆరు మండలాలనుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు చేతులెత్తి దండం పెట్టి అభ్యర్థిని మార్చాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలో అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి కుటుంబ పాలన సాగింది. కుటుంబసభ్యులకు మండలాలవారీ పెత్తనమిచ్చి పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేశారు. రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ అయిదేళ్లు మండలాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. సాంబశివారెడ్డి మరోసారి పెత్తనం చెలాయించేందుకు తనకు అనుకూలమైన అభ్యర్థిని తీసుకొచ్చారు’ అని మండిపడ్డారు. సాంబశివారెడ్డి సూచించిన వీరాంజనేయులును అభ్యర్థిగా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు చామలూరు రాజగోపాల్, మిద్దె కుళ్లాయప్ప, నార్పల సత్యనారాయణరెడ్డి, వంశీగోకుల్‌రెడ్డి, గార్లదిన్నె నారాయణరెడ్డి, చెన్నంపల్లి రాజశేఖర్‌రెడ్డి, బుక్కరాయసముద్రం ఎంపీపీ సునీత, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
అనంతపురంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశాన్ని నిర్వహించాలని వైకాపా అసమ్మతి నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. ‘ఆలూరు సాంబశివారెడ్డి అధికారాన్ని వినియోగించి సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులతో ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. బుక్కరాయసముద్రం, నార్పల, శింగనమలలో చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేయించి అనంతపురం వెళ్లకుండా నిలువరించారు. ఫంక్షన్‌హాల్‌ను జప్తు చేయిస్తామని అధికారులతో యజమానిని భయపెట్టించారు’ అని అసమ్మతి నాయకులు వాపోయారు. శివపురం పెద్దమ్మ ఆలయం వద్దకు నాయకులు, కార్యకర్తలు వెళ్లగా అక్కడికి దేవాదాయ శాఖ అధికారులను పంపి సమావేశం అడ్డుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post