రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మాజీమంత్రి ఎన్ అమరనాథరెడ్డి అన్నారు. మండలంలోని గొడుగు మానుపల్లిలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, దళిత ఉద్యోగులను తీవ్రంగా వేధించారని విమర్శించారు. ఎందరో దళితులను ఊచకోత కోసి హింసించారన్నారు. వైకాపాను రాష్ట్రం నుంచి తరిమి వేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ నియోజకవర్గ బాధ్యుడు థామస్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని, తనను నాన్ లోకల్ అంటున్నాడని, నా ఊరు ఏదో ఆయనకి తెలుసా అని ప్రశ్నించారు. నారాయణస్వామి ఒక చెత్త లాంటి వాడిని, అతడిని తీసి కుండీలో విసిరి పారేసే సమయం ఆసన్నమైందన్నారు. గొడుగుమానుపల్లెకు చెందిన 40 కుటుంబాలు మాజీ ఎంపీపీ షణ్ముగవర్మ, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో వైకాపా నుంచి తెదేపాలో చేరారు. వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
source : eenadu.net
Discussion about this post