గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు రాయదుర్గం వాల్మీకినగర్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. పూర్తి చేసుకున్న ఆధునిక నూతన భవనాలు ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. అయిదేళ్లుగా ఇన్‌ఛార్జి ప్రిన్సిపలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపులకు కలిపి ముగ్గురు విభాగాధిపతులు అవసరమైనప్పటికీ ఒక్కరూ లేరు. నలుగురు సీనియర్ అధ్యాపకులు ఇక్కడ పనిచేస్తుండగా మరొకరు డిప్యుటేషన్‌పై వేరే ప్రాంతానికి వెళ్లారు. 14 మంది జూనియర్ అధ్యాపకులు ఉండాల్సినప్పటికీ ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. మరో ముగ్గురు డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. మొత్తం 21 మంది బోధన సిబ్బంది అవసరమైతే ఆరుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
కళాశాలలో మరికొన్ని ఇంజినీరింగ్ విభాగాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 2018-19లో తెదేపా హయాంలో రూ.7 కోట్ల వ్యయంతో నూతన అదనపు భవనాన్ని నిర్మించి పూర్తి చేశారు. భవనం ప్రారంభించకుండానే చుట్టూ రంగులు వెలిసిపోయాయి. లోపల మరుగుదొడ్ల తలుపులు విరిగిపోయాయి. ద్వారాలకు ఉన్న గుమ్మాలు, తలుపులకు చెదలు పట్టి పాడవుతున్నాయి.
70 మంది మాత్రమే..
కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి వర్క్‌షాప్, హైడ్రాలిక్ ల్యాబ్, థర్మల్ ఇంజినీరింగ్ ల్యాబ్‌లు అవసరమవుతాయి. ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో మెకానికల్ విద్యార్థులు ల్యాబ్ కోసం అనంతపురానికి వెళ్లాలి. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, హైడ్రాలిక్, సర్వేయింగ్ ల్యాబ్ ఉండాలి. అవి ఇక్కడ లేకపోవడంతో విధి లేని పరిస్థితిలో కళ్యాణదుర్గానికి పరుగులు తీయాల్సి వస్తోంది.
source : eenadu.net
Discussion about this post