ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైకాపా నాయకులకు ఓ అధికారి సమాచారం ఇచ్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో గ్రంథాలయం, వాటర్ ప్లాంటుకు వైకాపా రంగులు ఉండటంతో స్థానికుడు ఫొటోలు తీసి సీ-విజిల్ యాప్‌లో ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోల్లో ఫిర్యాదుదారుడితో పాటు ఆయన స్నేహితుడు కూడా ఉన్నారు. గంటలోపే అధికారులు స్పందించి వాటికి తెల్లరంగు వేయించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్నా స్థానిక అధికారి ఒకరు ఆ ఫిర్యాదు చేసినవారి వివరాలు తెలిసేలా ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌షాట్ తీశారు. దాన్ని వైకాపా నాయకులకు పంపించారు. దీంతో ఫిర్యాదుదారుడి స్నేహితుడి సోదరుడికి వైకాపా నాయకులు ఫోన్ చేసి ప్రశ్నించారు. ఈ విషయం ఫిర్యాదుదారుడికి తెలియడంతో సీ-విజిల్ యాప్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.
దీనిపై ఆర్వో ఖాజావలి మాట్లాడుతూ ‘సీ-విజిల్‌లో నమోదైన ఫిర్యాదును పరిష్కరించేందుకు ఫ్లయింగ్ సర్వెలెన్స్ బృందం లొకేషన్ అడగడంతో ఫిర్యాదుదారు వివరాలతో కూడిన స్క్రీన్‌షాట్‌ను జూనియర్ అసిస్టెంట్ వాట్సప్ గ్రూపులో పెట్టారు. అప్పుడే అది బహిర్గతమైంది. ప్రధాన అధికారికి వ్యక్తిగతంగా పంపితే సరిపోయేది. ఇది కావాలని చేసిన పని కాదు. జూనియర్ అసిస్టెంట్‌కి షోకాజ్ నోటీసు ఇచ్చాం’ అని తెలిపారు.
source : eenaud.net
Discussion about this post