వైకాపా నాయకులు తమ జేబులను నింపుకొనేందుకు పాలన చేస్తున్నారే తప్ప ప్రజల కోసం కాదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. రుద్రవరంలోని ఎస్సీ కాలనీలో ‘బాబు స్యూరిటీ…భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా ఆమె ఆదివారం ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజలంతా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఈ రాక్షస పాలన నుంచి ఎప్పుడు బయటపడతామా? అని ఎదురుచూస్తున్నారని అన్నారు. గడిచిన ఐదేళ్లలో వైకాపా నాయకుల అక్రమాలు, అవినీతి చూసి ప్రజలకు విరక్తి కలిగిందన్నారు. ఈసారి ప్రజలు పొరపాటు చేస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేరన్నారు. రుద్రవరంలోని ఎస్సీ కాలనీలో గుడిసెలో ఉంటున్న జి.ఏసోబుకు విద్యుత్తు బిల్లు రూ.62 వేలు వచ్చిందన్నారు. ఎస్సీలను ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెడుతుందో తెలుస్తోందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగం రంగనాయకులు, పోలా గురుమూర్తి, రాజారావు, లక్ష్మీకాంత్‌యాదవ్, చంద్ర, బాచేపల్లెనారాయణ, యర్రం ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post