‘వైకాపా ప్రభుత్వం వచ్చాక తెదేపా కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అక్రమ కేసుల్లో ఇరికించి హింసించడంతో పాటు చాలా మందిని హత్య చేశారు. రాబోయే ఎన్నికలు చాలా కీలకం. వైకాపాను తరిమికొట్టడానికి మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలి’ అని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన బుధవారం శ్రీసత్యసాయి జిల్లాలో ఆమె పర్యటించారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో కలతచెంది ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను కలిసి ఆర్థికసాయం అందించారు. బత్తలపల్లి మండలం సంజీవపురం, కనగానపల్లి మండలం వేపకుంట, రామగిరి మండలం పోలేపల్లిలో చంద్రబాబును అక్రమ అరెస్టు చేసినప్పుడు తన కంటే కార్యకర్తలు, నాయకులే ఎక్కువ బాధపడ్డారని చెప్పారు. నాయకుడి పట్ల కార్యకర్తలకు ఉన్న ప్రేమను కళ్లారా చూసి చలించిపోయానన్నారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను స్వయంగా కలిసి ఓదార్చడానికే నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన ప్రతి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుంటా.. తెలుగుదేశంతోపాటు అధినేత కోసం త్యాగాలు చేసిన కుటుంబాల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న వైకాపా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. రానున్న ఎన్నికల సంగ్రామానికి సిద్ధమా? అంటూ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు.
కదిరి నుంచి బుధవారం ఉదయం బయలుదేరిన భువనేశ్వరి తొలుత బత్తలపల్లి మండలం సంజీవపురం చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక ప్రాణాలు విడిచిన చక్రపాణి, ఎం.వెంకట్రాముడు కుటుంబాలను పరామర్శించారు. తర్వాత కనగానపల్లి మండలం వేపకుంటలో నారాయణ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. రామగిరి మండలం పోలేపల్లిలో వెంకట్రాముడు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పెనుకొండ పట్టణం దర్గాపేటలోని ఆర్‌ఆర్. రహీమ్ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కు అందించారు.
source : eenadu.net
Discussion about this post