బీసీలపై వైకాపా ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని.. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. తెదేపా విజయానికి బీసీలంతా ఐక్యంగా పనిచేయాలని, వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా కృషి చేయాలని తెదేపా నేతలు పిలుపునిచ్చారు. కర్నూలు నగర శివారులోని ఎమ్మార్సీ ఫంక్షన్ హాలులో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ‘జయహో బీసీ’ సదస్సును ఆదివారం నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి పీజీ నరసింహులు యాదవ్ అధ్యక్షత వహించారు. ముందుగా ఎన్టీఆర్, జ్యోతిబాఫులె విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50 శాతం బీసీలున్నారని.. వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని అన్నారు. బీసీల ద్రోహి జగన్‌రెడ్డి అని అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఛైర్మన్లను నియమించారే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీసీలపై సీఎం కపటప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తెదేపా అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ తెదేపా బీసీల పార్టీ అని చెప్పారు. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో సత్తా ఏంటో చూపాలని పిలుపునిచ్చారు.
ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ… వైకాపా పాలనలో అన్నివర్గాల ప్రజలు మోసపోయారని చెప్పారు. మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్రం బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తెదేపా గెలుపొందాలన్నారు. మంత్రాలయం నియోజకవర్గ తెదేపా బాధ్యుడు పి.తిక్కారెడ్డి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీవారు తుపాకులతో భయపెట్టి ఓట్లేయించుకుంటారని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్నూలు తెదేపా అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ త్వరలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బీసీల మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నారని పేర్కొన్నారు. తెదేపా హయాంలో బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులంటే కేబినెట్ హోదా ఉండేదని.. వైకాపా ప్రభుత్వంలో ఆ పదవులకు విలువ లేకుండా పోయిందన్నారు.
source : eenadu.net
Discussion about this post