అధికార వైకాపా తలచుకుంటే ఏమైనా చేస్తుందనడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యం. జిల్లా జలవనరుల శాఖకు చెందిన రూ.కోట్లు ఖరీదు చేసే స్థలాన్ని నామమాత్రపు అద్దె చెల్లింపుతో సులువుగా స్వాధీనం చేసుకోడమే కాదు. ఏడాది తిరగకుండానే ఆ స్థలంలో ఆధునాతన హంగులతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించేస్తున్నారు. కానీ.. ఇదే స్థలం పక్కనే జలవనరులశాఖ సీఈ కార్యాలయ నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు.
అనంత నగర హెచ్చెల్సీ కాలనీలో జలవనరుల శాఖకు చెందిన ఒకటిన్నర ఎకరం స్థలంలో కళ్లు బైర్లు కమ్మేలా ఆధునాతన హంగులతో వైకాపా కార్యాలయాన్ని ఆగమేఘాలపై నిర్మించేస్తోంది. ప్రస్తుతం నిర్మాణం తుది దశకు చేరింది.
వైకాపా కార్యాలయ నిర్మాణం జరుగుతున్న పక్కన స్థలంలోనే జిల్లా జలవనరుల శాఖ సీఈ కార్యాలయ నిర్మాణం అటకెక్కింది. రెండేళ్ల క్రితం ప్రహరీ మాత్రమే నిర్మించి చేతులు దులుపేసుకున్నారు. ఇప్పటికీ సీఈ కార్యాలయ నిర్మాణం అతీగతీ లేదు.
అనంత నగర హెచ్చెల్సీ కాలనీలో రూ.30 కోట్లు ఖరీదైన ఒకటిన్నర ఎకరం స్థలాన్ని వైకాపా 33 ఏళ్ల లీజుకు తీసుకుంది. గతేడాది మార్చి మొదటి వారంలో జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.వేల కోట్లు ప్రభుత్వ పనులను దక్కించుకునే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఆధునాతన హంగులతో ఆకర్షణీయ రీతిలో ఏడాదిలోపే నిర్మాణం తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఆ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోనున్నారు. ఏడాదికి రూ.వెయ్యి అద్దె ప్రాతిపదికన 33 ఏళ్లు లీజుకు తీసుకుంది. పక్కా భవన సముదాయాన్ని నిర్మించేస్తున్నారు.
అనంత నగర తెలుగు తల్లి విగ్రహం ఎదురుగా ఉన్న హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయ స్థలాన్ని 2021 మార్చిలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అప్పగించారు. దీనికి ప్రత్యామ్నాయంగా జలవనరుల కార్యాలయం (ఎంఐ) ఆవరణలో ఆధునాతన హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయ భవన సముదాయినికి వైద్య, ఆరోగ్య శాఖ రూ.10 కోట్లు కేటాయించింది. ఈ డబ్బు ఇంతవరకు హెచ్చెల్సీ ఎస్‌ఈకి చేరలేదు. సరికదా ప్రస్తుత ఫీజుబులిటీ తెలపాలని ఎంఐ ఈఈకి లేఖ రాసినా అక్కడి నుంచి స్పందన లేదు. మూడేళ్లుగా హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయ భవన సముదాయ నిర్మాణంలో అతీగతీ లేదు. ఒకే శాఖలో రెండు రకాల పనుల్లో పురోగతి శూన్యం.
వైకాపా కార్యాలయాన్ని నిర్మిస్తున్న పక్కనే రూ.5 కోట్ల అంచనా వ్యయంతో సీఈ కార్యాలయ నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఓ గుత్తేదారుడు 2022 మార్చిలో సీఈ కార్యాలయ నిర్మాణాన్ని మొదలు పెట్టి.. ప్రహరీని పూర్తి చేశారు. ఇందుకు రూ.50 లక్షల వ్యయం అయింది. మధ్యలో ఈ స్థలాన్ని వైకాపాకు కేటాయించారన్న ఉద్దేశంతో పనులు ఆపేశారు. ఇక్కడ బదులుగా దీని పక్కనే వైకాపాకు కేటాయించారు. అయినప్పటికీ సీఈ కార్యాలయ పనులు పునఃప్రారంభం కాలేదు. ఈ గుత్తేదారుడు మృతి చెందారు. ప్రహరీకే రూ.50 లక్షలు ఖర్చు పెట్టినా వారి కుటుంబానికి బిల్లు చెల్లించలేదు.
source : eenadu.net
Discussion about this post