రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావట్లేదు ఉపాధి అవకాశాలు దొరకట్లేదు మొర్రో.. అని ఓ పక్కనుంచి మొత్తుకుంటుంటే.. మరోపక్క ఏపీలోని ఏకైక అతిపెద్ద పరిశ్రమ.. విశాఖపట్నం స్టీలు ప్లాంటును కాపాడలేకపోతోంది జగన్ ప్రభుత్వం.
‘ఆంధ్రుల హక్కు’గా చెప్పుకొనే విశాఖ ఉక్కును తుక్కుగా మార్చేందుకు పూనుకున్నట్టుంది. కర్మాగారం ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నాయని తెలిసినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేదు. పరిశ్రమ ఊపిరితీసేలా నిర్ణయాలు తీసుకుంటున్నా వ్యతిరేకించలేదు.
రాష్ట్రం ఆర్థిక సాయం చేసి ఆదుకునే అవకాశమున్నా.. ఏ మాత్రం స్పందించలేదు. గనుల లీజును తెలంగాణ పొడిగించినా.. రాష్ట్ర పరిధిలోని గనుల లీజుల్ని జగన్ మాత్రం కొనసాగించలేదు. వెరసి.. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి బిగించింది జగన్ సర్కారు!
ఎన్నికలకు ముందు జగన్ ఏమన్నారు?
నాకు 25 మంది ఎంపీలను గెలిపించి ఇవ్వండి.. కేంద్రం మెడలు వంచుతా. ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతా. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడి ప్లాంటుకు సొంత గనులు కేటాయించేలా చూస్తా.
అధికారంలోకి వచ్చాక ఏం చేశారు?
కేసులు, సొంత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కాలదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది బలిదానాలను, 22 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గాలికొదిలేశారు. ఉక్కు కార్మికుల బాధకు కారకుడయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తుంటే చేష్టలుడిగి చూశారే తప్ప.. దాని పరిరక్షణకు ఎక్కడా.. ఏ కోశానా ప్రయత్నించలేదు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడిన పాపానపోలేదు.
ఎం జగన్ నిర్లక్ష్య వైఖరి.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(వీఎస్‌పీ) పాలిట శాపంగా మారింది. విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్నా.. దాన్ని ఆదుకునేందుకు ప్రయత్నించకపోగా ఇంకా కష్టాల్లో కూరుకుపోయేలా వ్యవహరిస్తున్నారు. ప్లాంటును కాపాడుకునేందుకు ఆర్థికంగా చేయూతనివ్వాలని యాజమాన్యం, కార్మిక సంఘాలు చేసిన విన్నపాలను బుట్టదాఖలు చేశారు. ముడిపదార్థాలైన మాంగనీసు, సిలికా లభించకుండా గనుల పునరుద్ధరణ లీజులను జగన్ సర్కారు తొక్కిపట్టింది. వీటన్నింటిని పరిశీలిస్తే.. జగన్ సర్కారు ఓ పక్కా ప్రణాళిక ప్రకారం ‘విశాఖ ఉక్కు’ ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసేలా వ్యవహరిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక అతిపెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీలు ప్లాంటు మాత్రమే. ప్రత్యక్షంగా 31వేల మంది, పరోక్షంగా సుమారు లక్ష మంది దీనిద్వారా ఉపాధి పొందుతున్నారు. దీన్ని కాపాడుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడటంతోపాటు మరికొన్ని పరిశ్రమల స్థాపనకు ఆస్కారముంటుంది. అయినా జగన్ సర్కారు తెరచాటున విశాఖ ఉక్కు గొంతు కోసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రైవేటీకరణ ముంగిట ఉన్న ఈ ప్లాంటుకు అండగా నిలిస్తే కేంద్రానికి కోపం వస్తుందేమోనన్న భయంతోనే ఇలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి.
source : eenadu.net
Discussion about this post