‘కౌన్సిల్ ఏర్పడి మూడేళ్లు గడుస్తోంది.. మా వార్డుల్లో చిన్న పాటి అభివృద్ధి పని జరగలేదు.. కాలనీల్లోకి అడుగు పెట్టలేకపోతున్నాం.. ఒకరిద్దరి వార్డుల్లో కోట్లాది రూపాయలు పనులు జరిగాయి. పనులు మంజూరు చేసినా, మా వార్డుల్లో గుత్తేదారులు పనులు చేయలేదు. మా వార్డులపై వివక్షత ఎందుకు..?’ అని అధికార పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్‌లో పోడియం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. ఆందోళనలు సద్దుమణగకపోవడంతో ఎలాంటి చర్చ లేకుండానే, కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే, కార్యాలయ ఆవరణంలోని గాంధీ విగ్రహానికి ఛైర్ పర్సన్, వైస్ ఛైౖర్మన్ బలరామిరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణించిన మాజీ కౌన్సిలర్ కిష్టప్ప, సచివాలయ ఉద్యోగి శ్రీనివాసులుకు సంతాపం తెలుపుతూ, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అజెండాలోని అంశాలపై ఛైర్ పర్సన్ కౌన్సిల్‌లో చర్చ ప్రారంభించగానే, వైకాపా కౌన్సిలర్ ఇర్షాద్ విరుచుకుపడ్డారు. వార్డుల్లో చిన్న పాటి కల్వర్టును వేయలేదని వాపోయారు. ఆయనకు మద్దతుగా అధికార పార్టీకే చెందిన కౌన్సిలర్లు నాసిరాబాను, రహమత్‌బీ, నాగేంద్రమ్మ, అయూబ్ తదితరులు మాట్లాడారు. తమ వార్డుల్లోని సమస్యలను కౌన్సిల్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తేదారులతో చర్చించి, తమ వార్డుల్లో అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని కోరుతూ పోడియం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో 5 నిమిషాలపాటు సమావేశాన్ని ఛైర్ పర్సన్ వాయిదా వేశారు. అనంతరం సమావేశం ప్రారంభించగానే, నిరసనకు దిగిన కౌన్సిలర్లు అజెండాను రద్దు చేయాలని, కోట్లాది రూపాయల పనులు జరిగిన వార్డులకే మళ్లీ నిధులు కేటాయిస్తారా..? అని ప్రశ్నించారు. తమ డీసెంటును తెలియజేస్తూ, నోటీసు అందజేశారు. దీంతో అజెండాను ఆమోదించకుండా, సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఛైర్‌పర్సన్ ప్రకటించారు. సమావేశాన్ని వాయిదా వేయడంపై తెదేపా సభ్యులు, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు రమేశ్ కుమార్ తదితరులు అభ్యంతరం తెలిపారు. గత కొద్ది నెలల నుంచి సమావేశాన్ని కొద్ది సేపు నిర్వహించడం, అజెండాలోని అంశాలను వాయిదా వేయడం రివాజుగా మారిందని వాపోయారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post