వైకాపా పాలనలో ఇంటింటికీ బియ్యం, ఇతర సరకులు అందిస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధ పరిస్థితులు పలు చోట్ల ఉన్నాయి. మండల కేంద్రం వజ్రకరూరులో 2,250 రేషన్ కార్డులు ఉన్నాయి. అయిదుగురు చౌక ధరల దుకాణాల డీలర్లు ఉన్నారు. ఒక ఎండీయూ వాహనం ద్వారా ఇంటింటికీ బియ్యం పంపిణీ చేయాలి. పలు కారణాల వల్ల 9 నెలల కిందట ఎండీయూ ఆపరేటర్ రాజీనామా చేయడంతో వాహనం ద్వారా పంపిణీ నిలిచిపోయింది. తాత్కాలిక అనుమతితో వైకాపా నాయకుడు ఒకరు గత ఏడాది నవంబరులో ఎండీయూ వాహనాన్ని తీసుకున్నా.. దానిని బయటకు తీయలేదు. డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీ చేయడంతో కార్డుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎండీయూ ఆపరేటర్ నెలకు రూ.21 వేలు చొప్పున ఇప్పటివరకు మూడు నెలల వేతనం అందుకున్నారు. ఈ విషయంపై అధికారులు ఎవరూ నోరు విప్పడంలేదు. ‘జగనన్నకు చెబుదాం’ టోల్ ఫ్రీ నంబరు 1902కు పలు మార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారుల నుంచి స్పందన రాకపోవడంతో కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు.
source : eenadu.net
Discussion about this post