టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు దోపిడీలో భాగస్వాములై, అవినీతిని కొత్త పుంతలు తొక్కించిన ఆ టీడీపీ నేతలను ఇప్పుడు అదే చంద్రబాబు పాతాళంలోకి తొక్కేస్తున్నారు. చంద్రబాబుకు మాత్రమే సొంతమైన ‘యూజ్ అండ్ త్రో’ ఆటలో ఆ నేతలకు సొంత నియోజకవర్గాల్లోనే దిక్కు లేకుండాపోయింది. అధికారంలో ఉండగా ఈ నేతలకు సర్వాధికారాలూ ఇచ్చి, అక్రమ సంపాదనకు వారిని ప్రోత్సహించి, రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారికి టికెట్టు దక్కని పరిస్థితి కల్పించారు. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరిపోయాక పక్కన పడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న నైపుణ్యం.
సొంత కుటుంబం నుంచి పార్టీలో అనేక మంది నాయకుల వరకు చంద్రబాబు పాలసీకి బలైనవారే. తాజాగా ఆ కోటాలో టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు చేరిపోయారు. 2014–2019 మధ్య యధేచ్ఛగా అవినీతికి పాల్పడి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కి కప్పం గట్టిన వీరికి ఇప్పుడు సీట్లు లేకుండాపోయాయి. అప్పట్లో అధికారం తలకెక్కడంతో చంద్రబాబు చెప్పినట్లు చేసి తమ కోసం పనిచేసిన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్నే హింసించారు. తద్వారా కేడర్ వ్యతిరేకతను మోయలేనంతగా మూటగట్టుకున్న ఈ నేతలు ప్రజా క్షేత్రంలో బలం కోల్పోవడంతో చంద్రబాబు వెంటనే ప్లేటు ఫిరాయించేశారు. ఈ నేతలను పూచికపుల్లల్లా తీసి పక్కన పడేశారు.
source : sakshi.com
Discussion about this post