ఓ కేసు విషయంలో కోర్టుకు గైర్హాజరైన 19 మంది వైకాపా నాయకులకు రిమాండ్ విధిస్తూ అనంతపురం రెండో ప్రత్యేక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 2018 సంవత్సరంలో శింగనమల మండలం ఉల్లికల్లు ముంపు బాధితులకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తూ వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆలూరు సాంబశివారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు నాయనపల్లి క్రాస్‌లో ధర్నా నిర్వహించారు. దీనిపై శింగనమల పోలీసులు అప్పట్లో ఐపీసీ సెక్షన్ 341, 283 కింద కేసు నమోదు చేశారు. మొదటి నిందితుడిగా (ఏ1) ఆలూరు సాంబశివారెడ్డిని పేర్కొంటూ ఆయనతోపాటు 26 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును రెండో ప్రత్యేక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. నిందితుల్లో ఇద్దరు చనిపోగా 24 మంది విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నెల 8న వాయిదాకు నిందితులు ఎవరూ హాజరు కాలేదు. రాష్ట్ర విద్యా సలహాదారు సాంబశివారెడ్డితో పాటు 24 మందిపై కోర్టు వారెంట్ జారీ చేసింది. పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. మంగళవారం వాయిదాకు రావాల్సి ఉండగా సాంబశివారెడ్డితోపాటు ఆయన బంధువులు నలుగురు కోర్టుకు హాజరుకాలేదు. నిందితుల్లో 19 మంది వైకాపా నాయకులు కోర్టుకు హాజరయ్యారు. న్యాయవాది సెక్షన్ 70(2) కింద వారంట్‌ను రీకాల్ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. నిందితుల గైర్హాజరుకు సరైన కారణాలు లేవని పేర్కొన్న న్యాయమూర్తి రీకాల్ పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో 19 మందిని నిందితులను పోలీసులు రెడ్డిపల్లి జైలుకు తరలించారు.
source : eenadu.net
Discussion about this post