ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఏ అవసరానికైనా తామున్నామంటూ వలంటీర్లు స్థానికంగా పనిచేశారు. బదులుగా.. ప్రభుత్వం నుంచి పారితోషికం తీసుకున్నారు. లెక్క ప్రకారం వీరు ప్రభుత్వంలో భాగం. ఏ రాజకీయ పార్టీలకీ పనిచేయకూడదు. కానీ కొందరు వలంటీర్లు అధికార పార్టీవారి ఆదేశాలను పాటిస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసి.. ఉద్యోగాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా అధికార పార్టీవారి సూచన మేరకు రాజీనామా చేసేందుకూ సిద్ధమవుతున్నారు. ‘ఏం పరవాలేదు.. గెలిచాక మళ్లీ మీరే వలంటర్లు..’ అని వైసీపీవారు మభ్యపెడుతున్నారు. కానీ గెలవకపోతే..? అధికారం చేతులు మారితే..? చట్ట విరుద్ధంగా వ్యవహరించినందుకు చర్యలు తప్పకపోతే..? అప్పుడు వలంటీర్లను కాపాడేదెవరు..? కూటమి అధికారంలోకి వచ్చాక వలంటీర్లకు అండగా ఉంటామని, మరింత గౌరవిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టంగా ప్రకటించారు. వలంటీర్లు పునరాలోచన చేయాలని పలువురు సూచిస్తున్నారు.
ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ కొత్త ఒరవడికి తెరలేపింది. వలంటీర్లను ఎన్నికల వారియర్‌లుగా వాడుకుంటోంది. వారి వద్ద ఉన్న సమాచారం, ఓటర్లతో ఉన్న సంబంధాలను వాడుకుని మళ్లీ గద్దెనెక్కాలనే ఏకైక లక్ష్యంతో వ్యూహాలను అమలు చేస్తోంది. రాజకీయ పార్టీల కార్యక్రమాలకు వలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన ఆదేశించింది. ధిక్కరించి ప్రచారంలో పాల్గొంటున్నవారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ వైసీపీని గెలిపించే బాధ్యతను అధికార పార్టీ నాయకులు వలంటీర్లకే అప్పగిస్తున్నారు. ‘అధికారులు చర్యలు తీసుకోవడం ఏమిటి..? మీరే రాజీనామా చేయండి. పార్టీ కోసం పనిచేయండి. గెలిచిన తరువాత తిరిగి వలంటీర్లుగా తీసుకుంటాం..’ అని ప్రలోభ పెడుతున్నారు. పలువురు వలంటీర్లపై ఒత్తిడి తెచ్చి మరీ రాజీనామా చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది వలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది.
రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తరఫున పలువురు వలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. బొమ్మనహాళ్ మండలంలోని దర్గాహోన్నూరు గ్రామంలో ఏకంగా 33 మంది వలంటీర్లు తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, గ్రామ సర్పంచకు రాజీనామా పత్రాలను సమర్పించారు. మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథ్‌రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట, డి.హీరేహాళ్ మండలాలలో పలువురు వలంటీర్లు ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న కొందరిని ఇప్పటికే అధికారులు విధుల నుంచి తొలగించారు. దీంతో తొలగించక మునుపే రాజీనామా చేసి, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కొందరు వలంటీర్లు సిద్ధమౌతున్నారు.
ఏప్రిల్ 5న రాజీనామాలు..?
వలంటీర్లను ఎన్నికల్లో క్రియాశీలకంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న వైసీపీ, వారిచేత రాజీనామా చేయించి.. లబ్ధిపొందే దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి రాజీనామాలను సమర్పించాలని అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వలంటీర్లకు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను మార్చి నెలకు సంబంధించి పూర్తిగా నిర్వర్తించి, ఏప్రిల్ 5వ తేదీ నాటికి పింఛన్ల పంపిణీని ముగించాలని, ఆ తరువాత రాజీనామా చేయించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం వారికి చెల్లించే గౌరవవేతనం కూడా ఏప్రిల్ 5వ తేదీ నాటికి ఖాతాల్లో జమ అవుతుందని వైసీపీ నాయకులు వలంటీర్లకు చెప్పినట్లు తెలిసింది. అధికార పార్టీకి వంతపాడుతున్న వలంటీర్లు రెండు నెలల కోసం రాజీనామాలు చేద్దాం.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటివరకు వలంటీర్లపై పెత్తనం సాగించిన వైసీపీ నాయకులకు రాజీనామాలు చేయించే బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది.
దూరంగా ఉండండి..
ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ అభ్యర్థి, నాయకుల వెంట నడిచే వలంటీర్లు.. ఫొటోలు, వీడియోలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఫొటోలు, వీడియోలకు దూరంగా ఉంటేతప్ప తాము రక్షించలేమని కొందరు అధికారులు అధికార పార్టీ నాయకులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో రాజీనామాలు సమర్పించే వరకు జాగ్రత్తగా ఉంటూనే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ఉద్యోగాలు కోల్పోయిన వలంటీర్లను అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకుంటామని అభయం కూడా ఇస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వలంటీర్లు అన్నీ తామై ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
source : andhrajyothi.com
Discussion about this post