‘‘మనం ఎక్కువ సీట్లు తీసుకున్నాం, తక్కువ సీట్లు తీసుకున్నాం అని ఆలోచించకండి. ఈ సారి జగన్‌ను, ఆ పార్టీని పక్కన పెట్టకపోతే దేశానికే హాని. ఒకరి వద్ద ఇన్ని వేల కోట్ల డబ్బు, ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, అక్రమంగా ఇంత అధికారం చేరితే ఎవరూ బతకలేరు. రౌడీల చేతుల్లోంచి రాజ్యం తీసేసి కనీస విలువ ఉన్నవారిలో చేతిలో పెడదాం. ఈయనొక క్రిమినల్. వీళ్లంతా మర్రిచెట్టులా వేళ్లూనుకుపోయారు. జగన్‌ను, ఆయనతో పాటు ఉన్న అన్ని జలగలనూ ఓడిద్దాం’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘‘జగన్ సిద్ధం సిద్ధం అంటున్నారు. ఆయనకు యుద్ధమే ఇద్దామంటున్నాను. ఆ యుద్ధం అంతిమ లక్ష్యం ఈ వైకాపా ప్రభుత్వాన్ని దించెయ్యడమే. రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయడమే’’ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) జనసేనలో చేరారు. పవన్‌కల్యాణ్ ఆయనను, ఆయనతో పాటు మరికొందరు ముఖ్యులకు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం భీమవరం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… ‘‘జనసేనకు సీట్లు తగ్గిపోయాయని అందరూ అంటున్నారు. 2019 ఎన్నికల్లో నా ఒక్క సీటు గెలిచినా ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేది. ముందుతరం చేసిన తప్పులన్నింటికీ నేను పరిహారం కట్టాను. అసాధ్యమనుకున్న పొత్తును ఈ రోజు సుసాధ్యం చేయడంలో పవన్‌కల్యాణ్ కీలకమయ్యాడు. భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి కీలకమయ్యాడు. ఓడిపోయినా ప్రజలు గుండెల్లో పెట్టుకున్న స్థానం వల్లే ఈ పొత్తును కుదర్చడం సాధ్యమయింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే ఈ పొత్తుకు అడుగులు వేశాం. ఈ పొత్తు రాష్ట్రానికి చాలా కీలకం. కచ్చితంగా మే 15లోపు వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది’’ అని పవన్‌కల్యాణ్ ప్రకటించారు. తక్కువ సీట్లు అనుకోవద్దని, 175 సీట్లలో జనసేన, తెదేపా, భాజపా పోటీ చేస్తున్నాయని అనుకోవాలన్నారు.
కుబేరుల నగరం రౌడీ చేతిలో ఇరుక్కుంది
‘‘భీమవరం అత్యంత కుబేరులు ఉన్న నగరం. ఒక రౌడీ చేతిలో ఇరుక్కుపోయింది. నేను అడ్డగోలుగా దోపిడీలు, అన్యాయాలు చేస్తే మీకు నచ్చదు కదా. మనవాడు తప్పులు చేస్తున్నా కాపాడాలనుకుంటే ఈ సమాజాన్ని ఎవరూ మార్చలేరు. భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్‌ను తరిమెయ్యాలి. ఇక్కడికి వచ్చిన చాలామందికి అతను బంధువు. కాపు కులస్తుడే కావచ్చు.. అతనేమైనా మంచివాడా, సమాజానికి అండగా ఉండేవాడా, ఎలా వెనకేసుకు వస్తాం’’ అని వపన్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు తనవద్ద ఉన్న దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసి జైలుకు వెళ్లి వస్తే వైకాపా వారు జయజయధ్వానాలు చేస్తుంటే ఎలా? మనవాడే అని తప్పు చేసినవాడిని వెనకేసుకు వస్తే అంతా నష్టపోతాం’’ అని హెచ్చరించారు.
‘‘గ్రంధి శ్రీనివాస్ అనే రౌడీని ఓడించాలి. భీమవరంలో ఓడిపోయినప్పటి నుంచి అక్కడ పార్టీ కార్యాలయానికి, నివాసం ఉండేందుకు అవసరమైన భవన నిర్మాణానికి స్థలం అడుగుతున్నాను. అమ్మడానికి వచ్చినవారే ఎమ్మెల్యే భయంతో వెనక్కి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే భీమవరంలో ఎలాంటి రౌడీరాజ్యం ఉందో అర్థం చేసుకోండి. ఈ రోజు సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి భీమవరం వచ్చేసింది. ఆ పరిస్థితి పోవాలి. 2019 ఎన్నికల్లో భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు మన నాయకులే సంకెళ్లు వేసేశారు. వియ్యంకుడు అని, ఏం అనకండి అంటే ఏం చెయ్యాలి? భీమవరంలో ఓటమి కన్నా పులివెందులలో జగన్‌పై పోటీచేసి ఓడిపోయి ఉంటే ఇష్టపడేవాడిని. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండకూడదు. ప్రత్యర్థి వర్గమా, నా వర్గమా అనేదే ముఖ్యం. అన్ననే కాదనుకుని రాజకీయపార్టీ పెట్టిన వాడిని. ఈ పార్టీలోకి గొడవలు తగ్గించేవాడు రావాలి కానీ, గొడవలు పెంచేవాళ్లు రాకూడదు. అందుకే అంజిబాబును ఆహ్వానించాను. ఆయన కూడా బలమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. రాబోయే ఎన్నికల్లో భీమవరాన్ని జనసేన గెలిచి తీరాలి. ప్రత్యర్థి ఎన్ని కోట్లు పంచనివ్వండి, ఆ సీటు గెలిచేలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి’’ అని పేర్కొన్నారు. భీమవరంలో జనసేన గెలిచిన వెంటనే అక్కడ డంపింగ్‌యార్డు సమస్య పరిష్కరిస్తామని, రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామని అన్నారు. భీమవరం సీటుకు అభ్యర్థిని ప్రకటించాలని కార్యకర్తల్లో ఒకరు అరవగా.. వ్యూహం, టైమింగు తనకు వదిలెయ్యాలన్నారు. వైకాపా వాళ్లను వ్యూహం సినిమా తీసుకోనివ్వండి, మనం వ్యూహం పన్నుదాం అని చమత్కరించారు.
source : eenadu.net
Discussion about this post