పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో రూ.22,302 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ సంస్థలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) అనుమతించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మండలి మంగళవారం సమావేశమై, ఈ మేరకు ఆమోదించింది.
వైయస్‌ఆర్ జిల్లా చక్రాయపేట దగ్గర 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లి, రాప్తాడుల్లో కలిపి 1,050 మెగావాట్లు, డీ.హీరేహాళ్, బొమ్మనహాళ్‌లలో కలిపి 850 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేయనుంది. వీటికోసం ఆ సంస్థ రూ.12,065 కోట్ల పెట్టుబడిని పెట్టనుంది. 3,300 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.
నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం దగ్గర 171.60 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల్ని జేఎస్‌డబ్ల్యూ సంస్థ చేపట్టనుంది. వీటికోసం రూ.1,287 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి లభించింది. రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ప్రాజెక్టు వల్ల వెయ్యి మందికి ఉపాధి దొరుకుతుంది.
కర్నూలు జిల్లా ఆస్పిరి దగ్గర 200 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను అనుమతించారు. ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.1,350 కోట్లు. 200 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది.
శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి లభించింది. ఈ సంస్థ రూ.3,600 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ప్రత్యక్షంగా 600 మంది ఉపాధిని పొందుతారు.
source : eenadu.net
Discussion about this post