రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని, వైకాపా నాయకులు పేదల భూముల్ని లాక్కుని రికార్డులు మార్చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక తొలిసారి చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. ‘ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన సుబ్బారావు కుటుంబం వైకాపా భూదాహానికి బలైంది. ఆయన భూమిని వైకాపా వారు వేరే వారి పేరిట రికార్డుల్లోకి ఎక్కించడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. విశాఖలో ఎన్‌ఆర్‌ఐకి తుపాకీ గురి పెట్టి రూ.కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని రాసివ్వాలని వైకాపా రౌడీలు బెదిరించారు. రికార్డుల్ని మార్చి వేధించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లి ఆయన భూముల్ని కాపాడుకోవాల్సి వచ్చింది.
తిరుపతికి చెందిన సునీత ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. తిరుపతి కైకాల చెరువు సర్వే నంబరు 1లో ఆమె భూమిని కొన్నారు. దస్త్రాల్లో మార్పులు చేసి, దాన్ని వైకాపా దొంగలు కొట్టేశారు. ఇక్కడే ది గ్రేట్ పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఉన్నారు. జనార్దన నాయుడి క్వారీని బలవంతంగా లాక్కున్నారు. ప్రశ్నిస్తే వేధింపులు ప్రారంభమయ్యాయి’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. తొలుత కుప్పం పట్టణం కొత్తపేటలోని వినాయకుడి ఆలయంలో చంద్రబాబు పూజలు చేశారు. శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయ జీర్ణోద్ధరణ ప్రతిష్ఠ మహా కుంభాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం తెదేపా కార్యాలయం సమీపంలో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. సాయంత్రం ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత స్థానికంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కుప్పానికి వస్తే తనకు ఫుల్ జోష్ వస్తుందని, రీఛార్జి అయి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో చలాకీగా తిరుగుతానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.
‘వైకాపా పాలనలో అభివృద్ధి ఘోరంగా దెబ్బతింది. ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రాష్ట్ర అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ, కోసమే జనసేన, భాజపాతో పొత్తు పెట్టుకున్నాం’ అని చంద్రబాబు చెప్పారు. ‘రాష్ట్రం నిలబడాలి… ప్రజలు గెలవాలి’ అన్నదే తెదేపా, మిత్రపక్షాల లక్ష్యం అని, ఈ ఎజెండాతోనే మూడు పార్టీల జెండాలూ ఏకమయ్యాయని స్పష్టంచేశారు. పేదలకు న్యాయం జరగాలన్నా, రాజధానిని నిర్మించాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, పోలవరం కట్టేందుకు, రైతులకు రాయితీలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని వివరించారు.
‘కుప్పం బ్రాంచ్ కాలువ 90 శాతం పనుల్ని నేనే పూర్తి చేశా. వి.కోట వరకు నీళ్లు తెచ్చా. జగన్ ఇటీవల కుప్పానికి వచ్చి హంద్రీ-నీవా నీళ్లు ఇచ్చానంటూ హంగామా చేశారు. వచ్చాయా నీళ్లు? అయ్యా ముఖ్యమంత్రీ మా కుప్పంలో ఎక్కడ చూసినా నీళ్లే. మొత్తం మునిగిపోయింది. హెలికాప్టర్ పంపించు మమ్మల్ని రక్షించడానికి’ అంటూ చంద్రబాబు చలోక్తులు విసరడంతో నవ్వులు విరబూశాయి. ‘పులివెందులకూ నేనే నీళ్లు ఇచ్చాను. అందుకే నేను ఇప్పుడు వై నాట్ పులివెందుల అంటున్నా. 160కు పైగా అసెంబ్లీ స్థానాలు, 24 లోక్‌సభ నియోజకవర్గాల్లో కూటమిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదే’ అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.
‘ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించింది తెదేపానే. ఏ మహిళా ఇబ్బంది పడకూడదనే దీపం పథకం కింద వంటగ్యాస్ ఇచ్చా. జగన్ మాత్రం జె బ్రాండ్ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు. మద్యం రేట్లూ పెంచారు. ఎన్నికల సమయంలో విదేశాల నుంచి రూ.లక్షల కోట్ల డ్రగ్స్ తెప్పించారు. అక్రమాలపై ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారు. కుప్పంలో నన్నే అడ్డుకుని నాపైనే దాడికి యత్నించారు. అక్రమ కేసులు నమోదు చేసి కుప్పంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నాయకులను జైలుకు పంపారు. వారిని పరామర్శించేందుకు నా జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లా. ఆ తర్వాత నాకేమైందో మీరూ చూశారు (తనను అక్రమ కేసులో జైలుకు పంపారని చెబుతూ). ఈ విషయంలో నాకూ బాధగానే ఉంది. అలా అని కూర్చుండిపోతే ప్రజలు ఏమవుతారు? వారి భవిష్యత్తు కోసమే నేను పోరాడుతున్నా. ఈ అరాచక ప్రభుత్వాన్ని ఓడించాలి. సైకిల్ గుర్తుకే ఓట్లు వేయాలని మహిళలంతా ఇళ్లలోని పురుషులకు చెప్పాలి. ఓట్లు అడిగేందుకు వచ్చిన వైకాపా నాయకులకు మహిళలు కర్రు కాల్చి వాతపెట్టాలి’ అని పిలుపునిచ్చారు. తెదేపా అధికారంలోకి వచ్చాక 20 కుటుంబాలకు ఒక వ్యక్తిని నియమించి వారి జీవితాలను బాగు చేస్తామని, రూ.4 వేల పింఛనును ఇంటి వద్దకే తెచ్చిస్తామని చంద్రబాబు చెప్పారు.
source : eenadu.net
Discussion about this post