తెలుగుదేశం పార్టీ 41 ఏళ్ల చరిత్రలో ఘోర పరాభవమిది. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోతోంది. రాజ్యసభలో రాష్ట్ర కోటాలో ఏప్రిల్ 2 నాటికి ఖాళీ కానున్న మూడు స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. టీడీపీ చివరి సభ్యుడి పదవీ కాలం ఏప్రిల్ 2న ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్యాన్ని నిలుపుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలే చేశారు. తనదైన శైలిలో కుయుక్తులతో ఓ స్థానం గెల్చుకోవడానికి ప్రయత్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి తగినంత సంఖ్యా బలం శాసన సభలో లేకపోయినా.. ఓటుకు కోట్లు ఎరగా వేయాలన్న వ్యూహంతో బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు.
గతంలో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీకి లేని రాజ్యసభ స్థానాన్ని చేజిక్కించుకోవాలన్న దుగ్ధతో ఏకంగా ఓటుకు కోట్లు వెదజల్లడానికి సిద్ధమై, అడ్డంగా దొరికిపోయిన చరిత్ర చంద్రబాబుది. ఇంతే కాదు.. గతంలో రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్ముకున్నారన్న తీవ్ర విమర్శలు వచ్చాయి. తన వర్గానికి లేదా ఆర్థికంగా మేలు చేసే వారికే సీట్లు ఇచ్చేవారన్న విమర్శలు టీడీపీలోనే ఉన్నాయి. బడుగు, బలహీన వర్గాలకు ఒక్క అవకాశం కూడా ఉండేది కాదు. ఏపీలోనూ ఓ రాజ్యసభ స్థానాన్ని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు ఇచ్చినట్టే ఇచ్చి, చివర్లో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే కట్టబెట్టారు.
నామినేషన్ వేయడానికి వెళ్తున్న వర్ల రామయ్యను అవమానకరంగా మధ్య దారిలోనే వెనక్కి పంపించి మరీ తన వాడికి ఇచ్చుకొన్నారు. ఈసారి కూడా టీడీపీ తరపున రాజ్యసభ స్థానానికి ఓ అభ్యర్థిని నిలబెట్టి, ఓటుకు కోట్లు వెదజల్లడానికి సిద్ధమయ్యారు. అయితే, ఆయన కుయుక్తులు ఫలించకపోవడంతో చివరి నిమిషంలో తమ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. దీంతో రాష్ట్ర కోటాలోని 11 రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరాయి.
source : sakshi.com
Discussion about this post