రాష్ట్రవ్యాప్తంగా ఇసుక, మట్టి దోపిడీ చేస్తుంటే ధర్మవరంలో మాత్రం పంచభూతాలనూ దోచేస్తున్నారని కూటమి అభ్యర్థి సత్యకుమార్, పరిటాల సునీత, శ్రీరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాక్షస కబంధ హస్తాల నుంచి ధర్మవరాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో సత్యకుమార్‌ను మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లు సాధారంగా ఆహ్వానం పలికారు. అనంతరం అక్కడ భాజపా, తెదేపా నాయకులతో నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో సత్యకుమార్ మాట్లాడుతూ.. ఐదేళ్లలో ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకంట్రామిరెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు కొనసాగించారని, చెరువునే కబ్జా చేసిన ఎమ్మెల్యే విలాస ఇళ్లు నిర్మించుకుని రైతు నోట్లో మట్టికొట్టారని విమర్శించారు. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి తాను వచ్చామని, భాజపా జాతీయ కార్యదర్శిగా మూడుసార్లు పనిచేశామన్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. పరిటాల సునీత, శ్రీరామ్ సహకారంతో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. ధర్మవరం నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి తొలిసారిగా పోటీ చేయబోతున్నారని, అయనను గెలిపించుకోవాల్సి బాధ్యత మనందరిపై ఉందన్నారు. నియోజకవర్గం ఓటర్లంతా కూటమి అభ్యర్థి సత్యకుమార్‌ను ఆదరించి, ఆశీర్వదించాలని పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు.
source : eenadu.net
Discussion about this post