వైకాపా రాక్షస పాలనను అంతమొందించి గెలుపే ధ్యేయంగా ఏకసూత్రంతోనే తెలుగుదేశం, జనసేన పొత్తుతో అభ్యర్థుల ఎంపిక జరిగిందని, అసంతృప్తి అనేది పాలపొంగులాంటిదని.. క్రమంగా తగ్గిపోతుందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం సాయంత్రం అనంతపురంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ధ్యేయం ఒక్కటే.. ఎలాగైనా జగన్‌ను గద్దె దింపడమేనన్నారు. చంద్రబాబు సహజ వ్యక్తిత్వానికి భిన్నంగా నిష్పక్షపాతంగా, కుల, మత, బంధు ప్రీతి లేకుండా ఆఖరుకు ఆత్మీయులను కూడా దూరం పెట్టి గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చి దూకుడు ప్రదర్శించారన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు కచ్చితంగా తెదేపా గెలుస్తుందన్నారు. కళ్యాణదుర్గం ఉన్నం హనుమంతరాయ చౌదరి, బీకే పార్థసారథిలు పార్టీలో ఎంతో సీనియర్లని, పార్టీకి బాగా పని చేశారని.. ఇంకా మంచి వ్యక్తులను ఎంపిక చేయాలనే ఉద్దేశం తప్ప మరో కారణం లేదన్నారు. ఆశావహులకు టికెట్లు రాని వారితో చంద్రబాబు మాట్లాడుతున్నారని, తాను కూడా వారితో మాట్లాడుతానన్నారు. ఈసారి కుల సమీకరణలు ప్రభావం చూపుతుండటంతో టికెట్లు కేటాయించాల్సి వచ్చిందన్నారు. భాజపాతో పొత్తు రావాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కలిసినప్పుడు కుటుంబానికి ఒకటే టికెట్ అనే మాట చెప్పలేదని, కుమారుడు జేసీ పవన్‌పై ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. షర్మిల తెలంగాణకు వెళ్లకుండా ఏపీకి ముందుగా వచ్చి ఉంటే ఇంకా బాగుండేదన్నారు.
source : eenadu.net
Discussion about this post