ఎన్నికల యుద్ధానికి తెదేపా సిద్ధం అంటోంది. అన్ని విధాలా సమగ్ర సమాచారం సేకరించి.. పోరాటయోధులను గుర్తించి బరిలోకి దింపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలల ముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి అనంత జిల్లాలో 14 స్థానాలకు గాను 9 నియోజకవర్గాలకు ఖరారు చేసింది. ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీతకు వారి స్థానాలనే కేటాయించారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డి, శింగనమలకు బండారు శ్రావణిశ్రీ .. కళ్యాణదుర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబు, మడకశిర నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్‌కుమార్, పెనుకొండకు సవితను బరిలో నిలిపింది. దీంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా ఊపందుకుంది. అభ్యర్థుల ప్రకటనతో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. నేటి (ఆదివారం) నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేలా ఖరారైన అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్ అరాచక పాలనను అంతమొందించాలంటే పార్టీలో చిన్నచిన్న అంతర్గత విభేదాలు పక్కనపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిస్తున్నారు.
source : eenadu.net
Discussion about this post